కీలక కంపెనీల ఫలితాల ప్రభావం..

24 Oct, 2016 02:33 IST|Sakshi
కీలక కంపెనీల ఫలితాల ప్రభావం..

ఈ వారమే డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు
ఒడిదుడుకులు ఉంటాయ్
మార్కెట్ గమనంపై నిపుణుల అభిప్రాయం

న్యూఢిల్లీ: పలు ప్రధాన కంపెనీలు ఈ వారంలోనే తమ తమ రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు వెల్లడించనున్నాయి. ఈ ఫలితాలకు తోడు ఈ వారంలోనే అక్టోబర్ సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు అంశం కూడా స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తుందని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల ఇన్వెస్ట్‌మెంట్ సరళి, డాలర్‌తో రూపాయి మారకం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం తదితర అంశాలు కూడా ఈ వారం మార్కెట్ గమనంపై తగిన ప్రభావం చూపుతాయని వారంటున్నారు. ఈ వారంలో పలు దిగ్గజ కంపెనీలు తమ తమ సెప్టెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తాయని, ఈ ప్రకటనల ఆధారంగా స్టాక్ మార్కెట్ పయనిస్తుందని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డెరైక్టర్ అభినాశ్ కుమార్ సుధాంశు పేర్కొన్నారు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎన్‌టీపీసీ, ఐటీసీ, మారుతీ సుజుకీ కంపెనీలు క్యూ2 ఫలితాలను ఈ వారంలోనే వెల్లడించనున్నాయి.అక్టోబర్ సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్టులు ఈ నెల 27న(గురువారం) ముగియనుండడం వల్ల స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు గురవుతుందని నిపుణులు అంటున్నారు.

నేడు (సోమవారం)  యాక్సిస్ బ్యాంక్, ఐడియా సెల్యులర్, అదానీ పవర్, రిలయన్స్ క్యాపిటల్, భారతీ ఇన్‌ఫ్రాటెల్ కంపెనీలు తమ క్యూ2 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇక మంగళవారం(ఈ నెల25న) భారతీ ఎయిర్‌టెల్, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు, బుధవారం(ఈ నెల26న) హెచ్‌డీఎఫ్‌సీ, హీరో మోటొకార్ప్, హిందుస్తాన్ యునిలివర్, ఐటీసీలు, గురువారం(ఈ నెల27న) మారుతీ సుజుకీ, ఐఓసీ, టెక్ మహీంద్రాలు, శుక్రవారం (ఈ నెల 28న) బజాజ్ ఆటో, ఎన్‌టీపీసీ, వేదాంత, నెస్లే ఇండియా కంపెనీలు తమ తమ క్యూ2   ఫలితాలు వెల్లడిస్తాయి.

విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు రూ. 7,500 కోట్లు
ఈ నెలలో ఇప్పటివరకూ భారత మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు రూ.7,500 కోట్ల విలువైన పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. చైనా గణాంకాలు అంచనాలను అందుకోలేకపోవడం, అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇంకా పుంజుకోవలసి ఉందని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్‌పర్సన్ జానెట్ ఎలెన్ వ్యాఖ్యానించడం దీనికి కారణాలని పుణులంటున్నారు.కాగా గత నెలలో భారత క్యాపిటల్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల నికర పెట్టుబడులు రూ.29,232 కోట్లుగా ఉన్నాయి.

మరిన్ని వార్తలు