పారదర్శకత దిశ గా పరుగు!

4 Nov, 2016 22:41 IST|Sakshi
పారదర్శకత దిశ గా పరుగు!

స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు నిబంధనల్లో సవరణలు

సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు నిబంధనల్లో సవరణలు చేసింది. ఈ బిల్లు స్థిరాస్తి కొనుగోలుదారుల్లో కొత్త ఉత్సాహం నెలకొంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది అమల్లోకి వస్తే డెవలపర్లు ఇక నుంచి ప్రతి ప్రాజెక్ట్‌ను ప్రణాళికల దగ్గర నుంచి పూర్తి చేసే వరకూ పక్కాగా నిర్వర్తించాల్సి ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా జైలులో ఊచలు లెక్కపెట్టాల్సిందే. అంతేకాదు కొనుగోలుదారులూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి వీల్లేదు. మధ్యవర్తులూ అంతే. ఏమాత్రం తేడా వచ్చినా వీరికీ శ్రీకృష్ణ జన్మస్థానమే. ప్రస్తుతమున్న నిర్మాణాలూ బిల్లు పరిధిలోకే వస్తాయి కాబట్టి వీటిని గడువులోగా పూర్తి చేయక తప్పదు.

తాజా బిల్లు పరిధిలోకి చిన్న బిల్డర్లనూ చేర్చారు. దాదాపు 600 గజాల విస్తీర్ణం లేదా 8 ఫ్లాట్లు కట్టే బిల్డర్లు దీని పరిధిలోకి వస్తారు. గతంలో ఇది 1,200 గజాలుండేది. ఫ్లాట్లు కొనుగోలుచేసిన వారు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ అయిన రెండు నెలల్లోపు ఇంటిని సొంతం చేసుకోవాలి.

కొనుగోలుదారుల నుంచి వసూలు చేసే సొమ్ములో 70 శాతం సొమ్మును ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతాలో జమ చేయాలన్న నిబంధన కారణ ంగా నిర్మాణదారుల్లో కొత్త ఉత్సాహం నెలకొంటుంది. అంటే కస్టమర్ల నుంచి వసూలు చేసే సొమ్ము ఆయా ప్రాజెక్ట్ అవసరాల నిమిత్తమే వాడుతున్నారన్న భరోసా కొనుగోలుదారులకూ కలుగుతుంది.

ఒకసారి ప్రాజెక్ట్ పనులు ప్రారంభమయ్యాక కొనుగోలుదారుల అనుమతి లేకుండా ప్లాన్లు లేదా డి జైన్లు మార్చడానికి వీల్లేదు. దీనివల్ల ఇక నుంచి డెవలపర్లు నిర్మాణ పనుల్ని జరపడం కంటే ప్రణాళికల్ని రచించడంలోనూ అధిక సమయం వెచ్చించాల్సి ఉంటుంది.

ప్రతి ప్రాజెక్ట్‌ను స్థిరాస్తి నియంత్రణ ప్రాధికార సంస్థ (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ-రెరా) వద్ద నమోదు చేయించాలి. నమోదు రుసుంను సగానికి తగ్గించారు. స్థిరాస్తి ఏజెంట్ల నమోదుకు వ్యక్తులైతే రూ.10 వేలు, సంస్థ అయితే రూ.50 వేలు చెల్లించాలి.

రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ వద్ద భూ యజమాని, నిర్మాణదారు, లే-అవుట్, అనుమతి పత్రాలు, ప్లాన్, ఆర్కిటెక్ట్, గుత్తేదారు, ఇంజనీర్ల వివరాలూ సమర్పించాలి. రెగ్యులేటరీ వ్యవస్థ పరిధిలో ఉంటుంది కాబట్టి పారదర్శకత పెరుగుతుంది. ఇందుకు రాష్ర్ట స్థాయిలో రెరా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

నిర్మాణం పూర్తయిన ఐదేళ్ల వరకు నిర్మాణ పరమైన లోపాలకు నిర్మాణదారుడే బాధ్యత వహించాలి. నియంత్రణ సంస్థలకు ఫిర్యాదు చేసేందుకు రూ.1,000 చొప్పున, స్థిరాస్తి అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు వెళ్లేందుకు రూ.5 వేలు చొప్పున చెల్లించాలి. ట్రిబ్యునల్ 60 రోజుల్లో ఫిర్యాదులను పరిష్కరించాల్సి ఉంటుం ది. ఆదేశాలను ధిక్కరిస్తే ఫ్లాట్ రుసుంలో 10 శాతం చొప్పున డెవలపర్లు, కొనుగోలుదార్లూ చెల్లించాల్సి ఉంటుంది. జైలు శిక్ష కూడా విధించవచ్చు.

ప్రాజెక్ట్‌లో కొనుగోలుచేసిన వారికి రుసుము తిరిగి ఇవ్వాలన్నా, పరిహారం చెల్లించాల్సి వచ్చినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రామాణిక వడ్డీరేటుకు అదనంగా 2 శాతం జత చేసి ప్రమోటర్లు చెల్లించాల్సి ఉంటుంది. నిర్ణీత తేదీ నుంచి 45 రోజుల్లోగా ఇది చెల్లించాలి.

అపార్ట్‌మెంట్‌లకు సంబంధించిన అన్ని వివరాలు అంటే ఫ్లాట్ల సంఖ్య, వసతులు, పార్కింగ్, ఓపెన్ ఏరియా, కార్పెట్ ఏరియాతో సహా వెల్లడించాలి. ప్రాజెక్ట్ స్టేటస్ ఫొటోలతో సహా వెబ్‌సైట్‌లో పొందుపరచాలి. నిర్మాణ సంస్థ ప్రమోటర్లు తమ పాన్ నంబర్‌ను ఇవ్వాలి. వార్షిక నివేదిక, బ్యాలెన్స్ షీట్, క్యాష్ స్టేట్‌మెంట్స్, ఆడిటర్ రిపోర్ట్స్ వంటివన్నీ అందించాలి.

ఇబ్రహీంపట్నంలో జేబీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం, ఖానాపూర్ పరిధిలో జేబీ ఇన్‌ఫ్రా కొత్త వెంచర్‌ను ప్రారంభించింది. గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద 125 ఎకరాల్లో సెరెన్ సిటీని అభివృద్ధి చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. అండర్‌గ్రౌండ్ ఎలక్ట్రిక్ లైన్స్, 100, 80, 60, 40 ఫీట్ల అంతర్గత రోడ్లు, కృష్ణా వాటర్, సోలార్ ఫెన్సింగ్ కాంపౌండ్ వాల్‌తో ఈ వెంచర్‌ను రూపొందిస్తోంది. గతంలో జేబీ ఇన్‌ఫ్రా ఆదిభట్ల, బొంగ్లూరు, ఎలిమినేడు, మంగల్‌పల్లి గ్రామ పరిధిలో 8 వెంచర్లను పూర్తి చేసింది.

బిజినెస్ డెస్క్, సాక్షి టవర్స్, 6-3-249/1, రోడ్డు నెం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్-500 034.  realty@sakshi.com

మరిన్ని వార్తలు