ఇంధన ధరల్లో ప్రభుత్వ జోక్యం లేదు

17 Oct, 2018 00:21 IST|Sakshi

చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడి

న్యూఢిల్లీ: పెట్రోలియం ఉత్పత్తులపై నియంత్రణ ఎత్తివేసిన నేపథ్యంలో వాటి ధరల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోదని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పష్టం చేశారు. అంతర్జాతీయ విధానాలకు అనుగుణంగా రేట్లు నిర్ణయించుకునేందుకు ప్రభుత్వ రంగ చమురు రిటైల్‌ సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఉందని ఇండియా ఎనర్జీ ఫోరం సదస్సులో పాల్గొన్న సందర్భంగా విలేకరులకు ఆయన చెప్పారు. 

ఇటీవలే పెట్రోల్, డీజిల్‌పై రూ.1.50 మేర ఎక్సయిజ్‌ సుంకాన్ని తగ్గించిన కేంద్రం.. లీటరుకు మరో రూ.1 మేర తగ్గించాలంటూ పీఎస్‌యూ ఆయిల్‌ కంపెనీలను ఆదేశించడంపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రధాన్‌ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. పెట్రోలియం ఉత్పత్తుల ధరల విధానంలో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని, రోజువారీ ప్రాతిపదికన రేట్లపై నిర్ణయాధికారం పూర్తిగా ఆయిల్‌ కంపెనీలకే ఉంటుందని ప్రధాన్‌ చెప్పారు.  

చమురు మార్కెట్లో స్థిరత్వం మా కృషి ఫలితమే: ఒపెక్‌
చమురు రేట్ల విషయంలో భారత్‌ సహా ఇంధనాన్ని అత్యధికంగా వినియోగించే ఏ దేశం కూడా ఇబ్బంది పడేలా తాము వ్యవహరించలేదని చమురు ఎగుమతి దేశాల కూటమి ఒపెక్‌ పేర్కొంది. చమురు మార్కెట్‌ మళ్లీ స్థిరపడేందుకు ప్రయత్నించామని తెలిపింది. అయితే, పెద్ద దేశాల మధ్య వాణిజ్య యుద్ధాలు, వడ్డీ రేట్ల పెరుగుదల తదితర అంశాలు ఈ స్థిరత్వానికి ముప్పుగా పరిణమించాయని పేర్కొంది.

ఇండియా ఎనర్జీ ఫోరంలో పాల్గొన్న సందర్భంగా ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్‌ కంట్రీస్‌ (ఒపెక్‌) సెక్రటరి జనరల్‌ సానుసి బర్కిందో ఈ విషయాలు తెలిపారు. అధిక చమురు రేట్లతో ప్రపంచ ఎకానమీ వృద్ధికి విఘాతం కలుగుతుందంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో బర్కిందో తాజా వివరణనిచ్చారు.

వినియోగ దేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే తాము నిర్ణయాలు తీసుకుంటామని, చమురు మార్కెట్లో స్థిరత్వం వినియోగ దేశాలు సరైన ప్రణాళికలను అమలు చేయలేవని చెప్పారు. ప్రస్తుతం రోజుకు 97.2 మిలియన్‌ బ్యారెళ్లు (ఎంబీ/డీ)గా ఉన్న ప్రపంచ ఆయిల్‌ డిమాండ్‌  2040 నాటికి 111.7 ఎంబీ/డీకి చేరుతుందని ఈ పెరుగుదలలో దాదాపు 40 శాతం (5.8 ఎంబీ/డీ) భారత్‌దే ఉంటుందని బర్కిందో తెలిపారు.

మరిన్ని వార్తలు