పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం తాజా ఆదేశం

29 Dec, 2017 12:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్‌, డీజిల్‌పై విధిస్తున్న సేల్స్‌ ట్యాక్స్‌ లేదా వ్యాట్‌ను తగ్గించాలంటూ కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది. వినియోగదారులకు ప్రయోజనాలు చేకూర్చేందుకు రాష్ట్రాలు పన్నులు తగ్గించాలని ఆయిల్‌ మంత్రి  ధర్మేంద్ర ప్రధాన్‌ గురువారం ఆదేశించారు. ''పలు రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాయి. మరోసారి మేము అభ్యర్థిస్తున్నాం. ఎక్కువ మొత్తంలో వ్యాట్‌ను కలిగి ఉన్న రాష్ట్రాలు, వినియోగదారుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని పన్ను రేట్లను తగ్గించాలి'' అని మంత్రి చెప్పారు. అంతేకాక పెట్రోలియం రంగాన్ని గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ పరిధిలోకి తీసుకురానున్నట్టు కూడా తెలిపారు.

అంతర్జాతీయ ధరల ప్రభావంతో ఇటీవల విపరీతంగా పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పెంపుదలను నియంత్రణలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించింది. లీటరు పెట్రోల్‌కు 21.48గా ఉన్న ఎక్సైజ్‌ డ్యూటీని రూ.19.48కు తీసుకొచ్చింది. అదేవిధంగా డీజిల్‌పై రూ.17.33గా ఉన్న ఎక్సైజ్‌ డ్యూటీని రూ.15.33కు కుదించింది. ఈ తగ్గింపు ప్రయోజనాలు వినియోగదారులకు అందించాలని, అన్ని రాష్ట్రాలు వ్యాట్‌ల్లో కోత పెట్టాలని కేంద్రం అంతకముందే ఆదేశించిన సంగతి తెలిసిందే.   
 

మరిన్ని వార్తలు