ఇతర సంస్థల నుంచి డీజిల్‌ కొనుగోళ్ల నిలిపివేత

10 Nov, 2023 04:42 IST|Sakshi

వచ్చే ఏడాదిలో హెచ్‌పీసీఎల్‌ అమలు

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ వంటి కంపెనీల నుంచి డీజిల్‌ కొనుగోళ్లను వచ్చే ఏడాది నుంచి నిలిపివేయాలని ప్రభుత్వ రంగ హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) భావిస్తోంది. వైజాగ్‌ రిఫైనరీ విస్తరణ పనులు పూర్తయి, వచ్చే ఆర్థిక సంవత్సరం రాజస్థాన్‌లో కొత్త రిఫైనరీని నిర్మించిన తర్వాత నుంచి దీన్ని అమలు చేయనున్నట్లు ఇన్వెస్టర్లతో సమావేశంలో సంస్థ వెల్లడించింది.

వైజాగ్‌ రిఫైనరీ ప్రస్తుత వార్షిక సామర్ధ్యం 13.7 మిలియన్‌ టన్నులుగా ఉండగా విస్తరణ పనులు పూర్తయితే 15 మిలియన్‌ టన్నులకు పెరుగుతుందని కంపెనీ చైర్మన్‌ పుష్ప్‌ కుమార్‌ జోషి చెప్పారు. రాజస్థాన్‌ రిఫైనరీ 72 శాతం పూర్తయ్యిందని, వచ్చే ఏడాది దశలవారీగా వినియోగంలోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం తాము విక్రయించే పెట్రోల్‌లో 43 శాతం, డీజిల్‌లో 47 శాతం ఇంధనాలను ముంబై, వైజాగ్‌ రిఫైనరీలు సమకూరుస్తున్నాయి.

వైజాగ్‌ రిఫైనరీ విస్తరణ పనులు పూర్తయ్యాక డీజిల్‌ విక్రయాల్లో హెచ్‌పీసీఎల్‌ సొంత రిఫైనరీల వాటా 61 శాతానికి పెరుగుతుంది. రాజస్థాన్‌ రిఫైనరీ కూడా అందుబాటులోకి వస్తే మొత్తం డీజిల్‌ను హెచ్‌పీసీఎల్‌ సొంతంగానే ఉత్పత్తి చేసుకోగలుగుతుంది. దేశీయంగా మొత్తం పెట్రోల్‌ బంకుల్లో దాదాపు పావు శాతం బంకులు హెచ్‌పీసీఎల్‌వే ఉన్నాయి. అయితే, వాటిలో విక్రయ అవసరాలకు తగినంత స్థాయిలో సొంతంగా పెట్రోల్, డీజిల్‌ ఉత్పత్తి చేసుకోలేకపోతుండటంతో ప్రైవేట్‌ సంస్థల నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోంది. హెచ్‌పీసీఎల్‌ ఇప్పటికే తమ ముంబై రిఫైనరీ సామరŠాధ్యన్ని 7.5 మిలియన్‌ టన్నుల నుంచి 9.5 మిలియన్‌ టన్నులకు విస్తరించింది.

మరిన్ని వార్తలు