పండుగల జోష్‌.. పెట్రోల్, డీజిల్‌ అమ్మకాలు భేష్

6 Nov, 2023 07:39 IST|Sakshi

పెట్రోల్‌ విక్రయాల్లో 3 శాతం వృద్ధి

5 శాతం పెరిగిన డీజిల్‌ అమ్మకాలు

న్యూఢిల్లీ: పండుగల సీజన్‌లో పెట్రోల్, డీజిల్‌ అమ్మకాలకు డిమాండ్‌ ఏర్పడింది. అక్టోబర్‌ మొదటి 15 రోజుల్లో అమ్మకాలు తగ్గగా.. తర్వాతి 15 రోజుల్లో గణనీయంగా పెరిగాయి. దీంతో విక్రయాల్లో నికర వృద్ధి నమోదైంది. ప్రభుత్వరంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐవోసీ అక్టోబర్‌లో 3 శాతం అధికంగా 2.87 మిలియన్‌ టన్నుల పెట్రోల్‌ను విక్రయించాయి. డీజిల్‌ అమ్మకాలు 5 శాతం పెరిగి 6.91 మిలియన్‌ టన్నులుగా ఉన్నాయి. 

అక్టోబర్‌ మొదటి అర్ధభాగంలో పెట్రోల్‌ అమ్మకాలు 9 శాతం తగ్గగా, డీజిల్‌ విక్రయాలు 3.2 శాతం క్షీణతను చూడడం గమనార్హం. తిరిగి దసరా నవరాత్రుల సమయాల్లో వీటి విక్రయాలు బలంగా పుంజుకున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అక్టోబర్‌ తొలి 15 రోజుల్లో పెట్రోల్‌ విక్రయాలు 1.17 మిలియన్‌ టన్నులుగా ఉంటే, తర్వాతి 15 రోజుల్లో దీనికంటే 44 శాతం అధికంగా 1.70 మిలియన్‌ టన్నుల అమ్మకాలు నమోదయ్యాయి. 

డీజిల్‌ విక్రయాలు అక్టోబర్‌ మొదటి భాగంలో 2.99 మిలియన్‌ టన్నులుగా నమోదు కాగా, ద్వితీయ భాగంలో 3.91 మిలియన్‌ టన్నులుగా ఉన్నాయి. సెప్టెంబర్‌లో డీజిల్‌ అమ్మకాలు 5.82 మిలియన్‌ టన్నులుగా ఉన్నాయి. ఇక విమానయాన ఇంధనం (ఏటీఎఫ్‌) అమ్మకాలు అక్టోబర్‌ నెలకు 6,21,200 టన్నులుగా ఉన్నాయి. 2021 అక్టోబర్‌ విక్రయాలతో పోల్చి చూసినప్పుడు 6.9 శాతం పెరిగాయి. ఇక ఈ ఏడాది సెప్టెంబర్‌లో అమ్మకాలు 6,03,600 టన్నులతో పోల్చి చూసినా 3 శాతం వృద్ధి కనిపిస్తోంది. ఎల్‌పీజీ విక్రయాలు 5 శాతం వృద్ధితో 2.49 మిలియన్‌ టన్నులుగా ఉన్నాయి.

మరిన్ని వార్తలు