జోరుగా వాహన విక్రయాలు

2 Jul, 2016 00:52 IST|Sakshi
జోరుగా వాహన విక్రయాలు

మారుతీ, హోండా కార్స్ మినహా అన్ని కంపెనీల విక్రయాలు వృద్ధిలోనే
జూన్ నెల వాహన అమ్మకాల తీరు..
‘వేతన సిఫారసు’లతో మరిన్ని విక్రయాలు
భవిష్యత్‌పై కంపెనీల ఆశాభావం

న్యూఢిల్లీ: వాహన విక్రయాలు జూన్‌లో జోరుగా ఉన్నాయి. వర్షాలు బాగానే కురుస్తుండడం, కొత్త మోడళ్ల కారణంగా జూన్ నెలలో వాహన అమ్మకాలు పుంజుకున్నాయి. మారుతీ సుజుకీ కంపెనీకి విడిభాగాలు సరఫరా చేసే సుబ్రోస్ సంస్థలో అగ్నిప్రమాదం కారణంగా మారుతీ అమ్మకాలు మాత్రం 14 శాతం పడిపోయాయి. అయితే జిప్సి, గ్రాండ్ విటారా, ఎర్టిగ, ఎస్-క్రాస్, కాంపాక్ట ఎస్‌యూవీ విటారా బ్రెజ్జాలతో కూడిన యుటిలిటి వాహన  విక్రయాలు 76 శాతం పెరగడం విశేషం. హోండా కార్స్ ఇండియా అమ్మకాలు కూడా క్షీణించాయి.

మిగిలిన అన్ని కార్ల కంపెనీలు-టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, హ్యుందాయ్, ఫోర్డ్ ఇండియా, రెనో, మహీంద్రా అన్ని కంపెనీలు విక్రయాల్లో మంచి వృద్ధిని సాధించాయి. ద్విచక్ర వాహన కంపెనీలు కూడా మంచి అమ్మకాలనే సాధించాయి. హీరో మోటొకార్ప్ ఒక శాతం వృద్ధిని సాధించగా, హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా, టీవీఎస్ మోటార్, యమహా, రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీలు రెండంకెల వృద్ధిని సాధించాయి. వర్షాలు మంచిగా కురుస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెరగనున్నాయని, దీంతో సెంటిమెంట్, డిమాండ్ మెరుగుపడతాయని కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.  జూన్ నెల విక్రయానికి సంబంధించి వివరాలు...

 మారుతీ సుజుకీ: దేశీయ విక్రయాలు 10 శాతం క్షీణించాయి. చిన్నకార్ల విక్రయాలు 19 శాతం, కాంపాక్ట్ కార్ల విక్రయాలు 13 శాతం, వ్యాన్ల విక్రయాలు 6 శాతం చొప్పున తగ్గాయి.  ఎగుమతులు 45 శాతం పడిపోయాయి

 హ్యుందాయ్: గ్రాండ్ ఐ10, ఇలీట్ ఐ20, క్రెటా కార్లు మంచి అమ్మకాలు సాధించాయని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. వర్షాలు మంచిగా కురుస్తుండటం, ఏడవ వేతన సంఘం సిఫారసుల ఆమోదంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెరుగుతుండటం వంటి అంశాల కారణంగా అమ్మకాలకు అనుకూల వాతావరణం ఏర్పడిందని పేర్కొన్నారు.

మహీంద్రా ఎగుమతులు 41 శాతం, ఫోర్డ్ ఇండియా ఎగుమతులు మూడు రెట్లు, టాటా మోటార్స్ ఎగుమతులు 11 శాతం చొప్పున పెరిగాయి.

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా మోటార్ బైక్‌ల అమ్మకాలు 27 శాతం, స్కూటర్ల అమ్మకాలు 21 శాతం, ఎగుమతులు 13 శాతం చొప్పున పెరిగాయి.

పూర్తిగా స్వదేశీ ఆర్ అండ్ డీ టీమ్ అభివృద్ధి చేసిన స్ప్లెండర్ ఐస్మార్ట్ 110 మోటార్‌బైక్‌ను త్వరలో మార్కెట్లోకి తెస్తామని హీరో మోటోకార్ప్ తెలిపింది.

మరిన్ని వార్తలు