రూ. 1.72 లక్షల కోట్ల బకాయిలు కట్టండి

23 Dec, 2019 05:54 IST|Sakshi

గెయిల్‌ ఇండియాకు టెలికం విభాగం లేఖ

న్యూఢిల్లీ: ఇంటర్నెట్‌ సర్వీస్‌ లైసెన్సు (ఐఎస్‌పీ) ఫీజులు తదితర బాకీలకు సంబంధించి ఏకంగా రూ. 1.72 లక్షల కోట్లు కట్టాలంటూ ప్రభుత్వ రంగ గెయిల్‌ ఇండియాకు టెలికం విభాగం లేఖ పంపింది. ఐపీ–1, ఐపీ–2, ఐఎస్‌పీ లైసెన్సు ఫీజుల బకాయిల కింద రూ. 1,72,655 కోట్లు చెల్లించాలని ఇందులో సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఇప్పటికే కట్టాల్సినదంతా కట్టేశామని.. ఇక చెల్లించాల్సిన బాకీలం టూ ఏమీ లేవని గెయిల్‌ ప్రత్యుత్తరంలో పేర్కొన్నట్లు వివరించాయి. 2002లో తీసుకున్న ఐఎస్‌పీ లైసెన్సు గడువు 2017తో తీరిపోయిందని గెయిల్‌ తెలిపింది. అసలు దీనితో వ్యాపారమేమీ చేయనందున ఆదాయార్జన ప్రసక్తే లేదని పేర్కొంది.

ఇక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రొవైడర్‌ కేటగిరీ 1, 2 కింద తీసుకున్న లైసెన్సులపై 2001–02 నుంచి రూ. 35 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందని.. టెలికం విభాగం చెబుతున్నట్లుగా రూ. 2,49,788 కోట్లు కాదని స్పష్టం చేసింది. మరోవైపు, టెలికం విభాగం అడుగుతున్న మొత్తం .. గెయిల్‌ కంపెనీ విలువకు ఏకంగా మూడు రెట్లు ఉంటుందని సంస్థ వర్గాలు వ్యాఖ్యానించాయి. టెలికంయేతర వ్యాపా రాల ద్వారా వచ్చిన రెవెన్యూను కూడా ఆదాయం కిందే లెక్కించి, దాన్ని బట్టి లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీలను కట్టాలంటూ టెల్కోలను ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశించింది. తాజాగా ఇదే ప్రాతిపదికన బాకీలు కట్టాలంటూ గెయిల్‌ను టెలికం విభాగం ఆదేశించింది. 

మరిన్ని వార్తలు