డాలరు మద్దతుతో స్థిరంగా బంగారం: విశ్లేషకులు

11 Apr, 2016 01:13 IST|Sakshi
డాలరు మద్దతుతో స్థిరంగా బంగారం: విశ్లేషకులు

న్యూయార్క్/ముంబై: డాలరు ఇండెక్స్ క్షీణిస్తున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లో పుత్తడి ధర సమీప భవిష్యత్తులో స్థిరంగా వుంటుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ప్రధాన కరెన్సీలతో డాలరు మారకపు విలువ తగ్గినందున, ప్రపంచ మార్కెట్లో గతవారం ఔన్సు పుత్తడి ధర 1.62 శాతం పెరుగుదలతో 1,242 డాలర్ల వద్ద ముగిసింది. డాలరు విలువ తగ్గుతుంటే ఇన్వెస్టర్లు పుత్తడి కొనుగోళ్లవైపు సహజంగా మళ్లుతుంటారు.  అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఏప్రిల్‌లో జరిపే సమావేశంలో వడ్డీ రేట్ల పెంపు వుండకపోవొచ్చన్న అంచనాలు అటు డాలరు క్షీణతకు, ఇటు పుత్తడి పెరుగుదలకు కారణమని విశ్లేషకులు చెప్పారు.

ఫెడ్ రేట్ల పెంపు వుండకపోవొచ్చన్న అంచనాలు పుత్తడి ఫ్యూచర్స్‌కు మద్దతునిస్తున్నాయని వారన్నారు.
 దేశీయ మార్కెట్లో అప్... అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయ మార్కెట్లో కూడా గతవారం పుత్తడి ధర ఎగసింది. ముంబై బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛతగల 10 గ్రాముల పుత్తడి ధర అంతక్రితం వారంతో పోలిస్తే రూ. 390 పెరుగుదలతో రూ. 28,885 వద్ద ముగిసింది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కారణంగా స్టాకిస్టులు, రిటైలర్ల నుంచి కొనుగోలు మద్దతు లభించిందని బులియన్ ట్రేడర్లు చెప్పారు.

మరిన్ని వార్తలు