GV Prasad: డాక్టర్‌ రెడ్డీస్‌ లాబొరేటరీస్‌ కో చైర్మన్‌ జి.వి. ప్రసాద్‌తో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ..  

9 Sep, 2023 11:16 IST|Sakshi

ఒక ఫొటో వెయ్యి పదాలకు సమానం. పక్షులు, వన్య్రప్రాణల ఫొటోలు తీయాలంటే, గంటల కొద్దీ వేచి చూడాలి. వాటి ప్రశాంతతకు భంగం కలగకుండా ఫొటోలు తీయడం కత్తిమీద సాములాంటిదే. పారిశ్రామికవేత్త, డాక్టర్‌ రెడ్డీస్‌ లాబొరేటరీస్‌ లిమిటెడ్‌ కో చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.వి. ప్రసాద్‌కి మాత్రం అది ఆటవిడుపు. ఆయన దేశ విదేశాల్లో పర్యటించి తీసిన ఫొటోలతో ఇటీవల ‘ది బర్డ్స్‌ అండ్‌  బిలీఫ్స్‌’ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా... సాక్షితో సంభాషణ.

►ఔషధాల తయారీ రంగంలో తీరిక లేకుండా ఉండే మీకు, పక్షుల కోసం పర్యటనలు, ఫొటోగ్రఫీ హాబీ ఎప్పటి నుంచి? 
గత పది, పదిహేనేళ్లుగా ఫొటోగ్రఫీ చేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా పర్యటించి, స్వయంగా తీసిన ఫొటోల సమాహారమే ఈ పుస్తకం. కొన్ని ఫొటోలతో పుస్తకాన్ని తీసుకురావాలని, మరికొన్నింటితో ప్రదర్శన ఏర్పాటు చేయాలని నా ఆలోచన. గతంలో రెండు పుస్తకాలు ప్రచురించాను. ఒకటి అలాస్కా మీద, మరొకటి స్పితి వ్యాలీ. ఇది మూడో పుస్తకం.

 ‘బర్డ్స్‌ అండ్‌ బిలీఫ్స్‌’ లో మంచి కొటేషన్‌లు కూడా కనిపిస్తున్నాయి!
నన్ను ప్రభావితం చేసే సూక్తులు కనిపించినప్పడు, విన్నప్పుడు పుస్తకంలో రాసుకోవడం నాకు పాతికేళ్లుగా అలవాటు. వాటిలో కొన్నింటిని ఇందులో పొందుపరిచాను. ఈ పుస్తకం నా అభిరుచికి, జ్ఞాపకాలకు నిలువుటద్దం.

ఇందులో ఏఏ ప్రదేశాల పక్షులున్నాయి? 
మనదేశంలో దక్షిణాదిలో హైదరాబాద్, ఉత్తరాది నుంచి భరత్‌పూర్, కాన్హా నేషనల్ పార్క్‌. ఆఫ్రికా ఖండంలో కెన్యా, టాంజానియా, బొట్సువానా, నార్త్‌ ఆర్కిటిక్, అంటార్కిటికా తదితర ప్రాంతాల పక్షుల ఫొటోలున్నాయి. ఆంటార్కిటికాలో పెంగ్విన్స్‌ కూడా తీశాను. నార్త్‌ అమెరికాలో అలాస్కా కూడా కవర్‌ చేశాను. ఈ ప్రాంతాలలో కనిపించే పక్షులతో పాటు క్షీరదాలు, ప్రకృతి ఫొటోలూ తీశాను. కానీ, ఈ పుస్తకాన్ని మాత్రం పక్షుల కోసమే కేటాయించాను.

వలస పక్షులు భారీగా వచ్చే ఆంధ్రప్రదేశ్, పులికాట్‌ సరస్సుకు వెళ్లారా?
వెళ్లాను, ఫ్లెమింగో ఫొటోలు తీశాను. కానీ ఈ పుస్తకంలో ప్రచురించలేదు.

► బర్డ్‌ వాచింగ్‌ కోసం విభిన్నమైన అనేక ప్రాంతాలను సందర్శించారు. మీకు బాగా నచ్చిన ప్రదేశం, సందర్భం, ఫొటో ఏది?
అలాస్కాలో ల్యాండ్‌ స్కేప్‌లు, మంచినీటి సరస్సులు, ఉప్పు నీటి చెరువులు, పొరలు పొరలుగా పేరుకుపోయిన మంచు... మొత్తంగా చూస్తే ప్రకృతి అద్భుతంగా స్ఫూర్తిదాయంగా అనిపిస్తుంటుంది. పెద్ద ఎలుగుబంట్లు, బాల్డ్‌ ఈగల్స్, సాల్మన్‌ చేపలతో పాటు రకరకాల చేపలుంటాయి. సముద్రం నుంచి మంచి నీటి సరస్సుల వైపుకు గుంపులుగా వచ్చే చేపల్ని చూడడం వర్ణించలేనటువంటి అనుభూతి. అలాగే మరొకటి... ఆఫ్రికాలో ప్రాణులు వలస వెళ్లడం. వైల్డ్‌ బీస్ట్‌ పెద్ద సంఖ్యలో నదిని దాటుతున్న దృశ్యం ఇప్పటికీ కళ్లముందు కదలాడుతోంది.

► ఆర్నిథాలజిస్టు ఆశిష్, కెమెరా మెళకువలు నేర్పిన సురేశ్‌ చిత్తూరి గురించి మీ పుస్తకంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు!
ఆశిష్‌తో చాలా ఏళ్ల పరిచయం. వాళ్ల పిల్లలు, మా పిల్లలు క్లాస్‌మేట్స్‌. బర్డ్‌ వాచింగ్‌ను పరిచయం చేసింది ఆయనే. ఇక శ్రీనివాస హ్యాచరీస్‌ సురేశ్‌ చిత్తూరి కూడా నాకు మంచి మార్గదర్శి.

► ఎన్నిరకాల పక్షులను ఫొటో తీశారు?
రెండువందలకు పైగా పక్షి జాతులను ఫొటో తీశాను.

► మీ పుస్తకంలో పాలపిట్ట, కాకి, కోకిల కనిపించాయి. కానీ రామచిలుక కనిపించలేదు! అలాగే కొల్లేటి కొంగలు, చిల్కా సరస్సులో విహరించే పక్షులను మేము తర్వాతి పుస్తకంలో చూడవచ్చా?
రామచిలుకల ఫొటో తీశాను. కానీ, పుస్తకానికి ఫొటోల ఎంపికలో వదలిపెట్టాను. కొల్లేరు వెళ్లలేదు. చిల్కా సరస్సుకు వచ్చే ఏడాది వెళదామనుకుంటున్నాను.

  మీ నేపథ్యం మొత్తం హైదరాబాదేనా?
లేదు, పాక్షిక హైదరాబాదీని. నాల్గవ తరగతి వరకు హైదరాబాద్‌లో చదివాను. తర్వాత నెల్లూరులో 12వ తరగతి వరకు, రెండున్నరేళ్లు చెన్నై అన్నా యూనివర్సిటీ, ఆ తర్వాత చికాగోలో ఇలినాయీ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీలో కెమికల్‌ ఇంజినీరింగ్, మాస్టర్స్‌ పర్‌డ్యూ (Purdue University) యూనివర్సిటీలో పూర్తి చేసి హైదరాబాద్‌కి వచ్చాను.

► పుస్తకం విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని వన్య్ర΄ాణుల సంరక్షణ కోసం విరాళమని ప్రకటించారు. వన్య్రప్రాణుల సంరక్షణలో ప్రభుత్వం తగినంత శ్రద్ధ చూపట్లేదని అనుకుంటున్నారా? 
ప్రభుత్వం వన్య్రప్రాణుల సంరక్షణకు పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేస్తోంది. కానీ, ప్రభుత్వం ఒక్కటే అన్నింటినీ పరిష్కరించలేదు. వ్యక్తుల విరాళాలు చాలా ఉపయోగ పడతాయి. పర్యావరణం, వన్య్రప్రాణుల పరిరక్షణ ముఖ్యమైన అంశం అని నేను మద్దతు ఇస్తున్నాను. ఆన్‌లైన్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా విక్రయిస్తున్నాం. పుస్తక విక్రయాలతో వచ్చే డబ్బు నాకవసరం లేదు. ఉచితంగా ఇస్తే పుస్తకం గౌరవం తగ్గిపోతుంది. అందుకే విక్రయాలను మంచి పనికి విరాళంగా ఇవ్వాలనుకున్నాను.

► అంజిరెడ్డి (డాక్టర్‌ రెడ్డీస్‌ లాబొరేటరీస్‌ వ్యవస్థాపకులు)గారు చెప్పినట్లుగా మన కుండ నిండిన తర్వాత, అదనంగా వచ్చి పడుతున్న నీటిని మరొకరికి ఉపయోగపడేలా చేయాలి అనే సూత్రాన్ని పాటిస్తున్నారా? ఆయన నుంచి అలాగే మీ నాన్నగారి నుంచి మీరు నేర్చుకున్నదేమిటి?
మా నాన్నగారు (గ్రీన్‌ పార్క్‌ హోటల్‌ వ్యవస్థాపకులు) చాలా డీటెయిల్‌ ఓరియెంటెడ్‌. మనం చేస్తున్న పని గురించి సూక్ష్మ స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని చెబుతారు. వివరాలన్నీ సమగ్రంగా తెలుసుకున్న తర్వాతే మాట్లాడేవారు. మా మామగారు (అంజిరెడ్డి) విజన్‌ చాలా విస్తృతమైనది. వారిద్దరినీ ఒకే ’ఫ్రేమ్‌’లో చె΄్పాలంటే... ‘అడవి అందులో చెట్లు’ అని చెప్పవచ్చు. అంజిరెడ్డి గారి ద్వారా అడవిని చూస్తే, మా నాన్న గారి ద్వారా అందులో వృక్షాలను చూశాను.

► పాఠకులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి?
‘ప్రపంచంలోని ప్రతిదీ ప్రకృతితో ముడిపడి ఉంటుంది. మన ఆరోగ్యం అడవి ఆరోగ్యంతో ముడిపడి ఉంది. మన శ్రేయస్సు కోసం ప్రకృతి పరిరక్షణ తప్పనిసరి’ అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరూ ‘కొంతవరకైనా ప్రకృతితో మమేకమవుదాం’ అనుకుంటే... ప్రకృతి పరిరక్షణ కోసం చేయగలిగిన చిన్న చిన్న పనులు అందరమూ చేయగలుగుతాం.

శాస్త్రీయతకు గౌరవం డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థలో 1990 నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తున్న జీవీ ప్రసాద్‌ ఆ సంస్థ ఎదుగుదల, 66 దేశాలకు విస్తరణలో తనవంతుగా విశేషమైన కృషి చేశారు. సశాస్త్రీయమైన పరిశోధనల పరంపరలో ఆయనను వరించిన కొన్ని ప్రత్యేక గుర్తింపులు... పురస్కారాలివి. 

  • వైపీఓ గ్లోబల్‌ ఇంపాక్ట్‌ అవార్డు– 2020
  • వి. కృష్ణమూర్తి అవార్డ్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ బై ద సెంటర్‌ ఫర్‌ ఆర్గనైజేషనల్‌ డెవలప్‌మెంట్, 2019
  • బౌండరీ బ్రేకర్‌ లీడర్‌ అవార్డ్, సీఈఓ అవార్డ్స్‌ 2018
  • ఇండియా బిజినెస్‌ లీడర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ బై సీఎన్‌బీసీ ఆసియా, 2015
  • ఇండియాస్‌ బెస్ట్‌ సీఈవో బై బిజినెస్‌ టుడే, 2014
  • ఇండియా టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ అవార్డ్‌ బై సీఎన్‌బీసీ ఆసియా, 2014

ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి

మరిన్ని వార్తలు