డాక్టర్‌ రెడ్డీస్‌ లాభం రూ. 337 కోట్లు

13 May, 2017 00:50 IST|Sakshi
డాక్టర్‌ రెడ్డీస్‌ లాభం రూ. 337 కోట్లు

► క్యూ4లో 175% వృద్ధి  
► రూ. 3,632 కోట్ల ఆదాయం
►  రూ. 20 డివిడెండ్‌
► అమెరికా మార్కెట్లో ధరల ఒత్తిళ్లు  


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ నికర లాభం సుమారు 175 శాతం వృద్ధితో రూ.337.6 కోట్లకు ఎగసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇది రూ.122.6 కోట్లే. అయితే, తాజా క్యూ4లో మొత్తం ఆదాయం మాత్రం సుమారు 6 శాతం క్షీణించి రూ.3,880 కోట్ల నుంచి రూ.3,632 కోట్లకు పరిమితమైంది. కీలకమైన అమెరికా మార్కెట్లో ధరల పరమైన ఒత్తిళ్లు, పెద్ద స్థాయిలో కొత్త ఉత్పత్తులేమీ ప్రవేశపెట్టకపోవడం ఇందుకు కారణమని ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ సీఈవో జీవీ ప్రసాద్‌ శుక్రవారం విలేకరులకు చెప్పారు.

విశాఖ జిల్లాలోని దువ్వాడ ఇంజెక్టబుల్స్‌ ప్లాంట్‌లో అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ తనిఖీల్లో లేవనెత్తిన అంశాల పరిష్కారం చర్యలపై మరింతగా దృష్టి సారిస్తున్నామని ఆయన తెలియజేశారు. అటు బాచుపల్లి ప్లాంటులో అబ్జర్వేషన్‌ల పరిష్కారం సమస్యాత్మకమేమీ కాదని, దీనిపై ఎఫ్‌డీఏతో ఉత్తరప్రత్యుత్తరాలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. ఇటీవల ఎఫ్‌డీఏల తనిఖీలు పెరిగిన అంశంపై స్పందిస్తూ... ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి ఉందని, అమెరికా నియంత్రణ సంస్థలు ప్రమాణాల్ని అమలు చేయటంపై మరింత కఠినంగా దృష్టి పెడుతున్నాయని ప్రసాద్‌ చెప్పారు. రూ.5 ముఖవిలువ గల షేరు ఒక్కింటిపై రూ. 20 మేర (ఫేస్‌ వ్యాల్యూపై 400 శాతం) డివిడెండ్‌ ఇవ్వాలని కంపెనీ బోర్డు ప్రతిపాదించింది.

దేశీ మార్కెట్లో అనిశ్చితి..: ధరలపరమైన నియంత్రణలతో దేశీ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని ప్రసాద్‌ తెలియజేశారు. త్వరలో అమల్లోకి రాబోయే వస్తు, సేవల పన్నుల విధానం కూడా పంపిణీ వ్యవస్థపై కొంత ప్రభావం చూపవచ్చని చెప్పారు. అయితే ఇది తాత్కాలికమే కావచ్చని, తాము అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. అటు కీలకమైన అమెరికా మార్కెట్లో అనుమతులు క్రమంగా రావడం మొదలైందని, తదుపరి క్వార్టర్స్‌ నుంచి ఇది మరింత వేగవంతం కావొచ్చని చెప్పారాయన. చైనా, దక్షిణ అమెరికా, ఆసియా పసిఫిక్‌ ప్రాంతాల్లో కార్యకలాపాల విస్తరణ గణనీయంగా జరుగుతోందని, ఈ ఏడాది చిలీ మార్కెట్లోనూ ప్రవేశించనున్నామని సీవోవో అభిజిత్‌ ముఖర్జీ తెలిపారు.

చైనాలో ఆంకాలజీ ఉత్పత్తులకు ఫైలింగ్‌ చేస్తున్నామని, మూడు నుంచి అయిదేళ్ల వ్యవధిలో మరింతగా మార్కెట్‌ సాధించే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రొప్రైటరీ ఉత్పత్తులకు సంబంధించి డెర్మటాలజీ, న్యూరాలజీ ఔషధాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని, ఇక బయోసిమిలర్స్‌ విషయానికొస్తే రెడిటక్స్‌ ఔషధాన్ని త్వరలో పలు మార్కెట్లలో ప్రవేశపెట్టనున్నామని ప్రసాద్‌ చెప్పారు. ఈ ఏడాది అమెరికాలో 10 సహా ప్రపంచవ్యాప్తంగా మొత్తం మీద సుమారు 80 ఉత్పత్తులదాకా ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం కూడా పెట్టుబడి వ్యయాలు రూ.1,000–1,200 కోట్ల స్థాయిలోనే ఉంటాయని సీఎఫ్‌వో సౌమేన్‌ చక్రవర్తి చెప్పారు.

తగ్గిన జనరిక్స్‌ వృద్ధి ..
నాలుగో త్రైమాసికంలో ప్రపంచ వ్యాప్తంగా జనరిక్స్‌ వృద్ధి అయిదు శాతం క్షీణించింది. ప్రధానమైన ఉత్తర అమెరికా మార్కెట్లో 19 శాతం తగ్గింది. అయితే, యూరప్, భారత్, వర్ధమాన మార్కెట్లలో సానుకూల వృద్ధి నమోదైంది. ఇక పీఎస్‌ఏఐ విభాగంలోనూ మొత్తం మీద వృద్ధి ఆరు శాతం క్షీణించగా, ఉత్తర అమెరికాలో 28 శాతం తగ్గింది. వెనెజులాలో కార్యకలాపాల సమస్యల వల్ల వర్ధమాన మార్కెట్ల ఆదాయాలు 11 శాతం క్షీణించినట్లు సౌమేన్‌ చక్రవర్తి చెప్పారు.

క్యూ4లో అమెరికాలో 13 ఔషధాల జనరిక్స్‌ తయారీ అనుమతులకు దరఖాస్తులు (ఏఎన్‌డీఏ) చేసినట్లు చెప్పారాయన. పూర్తి ఆర్థిక సంవత్సరంలో లాభాల మార్జిన్‌ 400 బేసిస్‌ పాయింట్లు తగ్గి 55.6 శాతానికి పరిమితమైంది. ఉత్తర అమెరికా మార్కెట్లో జనరిక్స్‌ వ్యాపార విభాగంలో ఔషధాల ధరల్లో తగ్గుదల, అధిక తయారీ వ్యయాలు తదితర అంశాలు ఇందుకు కారణం. శుక్రవారం ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ షేరు సుమారు 0.30 శాతం క్షీణించి రూ. 2,584.70 వద్ద ముగిసింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు