డాక్టర్ రెడ్డీస్ లాభం 8% అప్

13 May, 2015 01:45 IST|Sakshi
డాక్టర్ రెడ్డీస్ లాభం 8% అప్

క్యూ4లో రూ. 519 కోట్లు
కరెన్సీ హెచ్చుతగ్గుల ప్రతికూల ప్రభావం
ఒక్కో షేరుకి రూ. 20 డివిడెండు..

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ నికర లాభం 8 శాతం పెరిగి రూ. 519 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇది రూ. 481 కోట్లు. మరోవైపు ఆదాయం 11 శాతం వృద్ధితో రూ. 3,481 కోట్ల నుంచి రూ. 3,870 కోట్లకు పెరిగింది. వర్ధమాన మార్కెట్లలో కరెన్సీ తీవ్ర హెచ్చుతగ్గులకు లోను కావడం..

లాభాలపై దాదాపు రూ. 84 కోట్ల మేర ప్రతికూల ప్రభావం చూపిందని మంగళవారం ఇక్కడ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ సీఈవో జీవీ ప్రసాద్ తెలిపారు. రష్యా కరెన్సీ డీవేల్యుయేషన్ తదితర అంశాలు ఇందుకు కారణమని వివరించారు. మరిన్ని కొత్త ఉత్పత్తులు ప్రవేశపెట్టడం ద్వారా రెండంకెల స్థాయి వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.   ఓటీసీ ఉత్పత్తుల ఊతంతో తొలిసారిగా అమెరికా జనరిక్స్ మార్కెట్లో తొలిసారిగా బిలియన్ డాలర్ల అమ్మకాలను సాధించినట్లు డాక్టర్ రెడ్డీస్  సీఎఫ్‌వో సౌమేన్ చక్రవర్తి తెలిపారు. యూసీబీ కొనుగోలు ప్రక్రియ ఈ త్రైమాసికంలో పూర్తి కాగలదని, దీంతో ఆదాయాలు మరో రూ. 150 కోట్ల మేర పెరగగలవని పేర్కొన్నారు. రూ. 5 ముఖవిలువ గల షేరుపై రూ.20 డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు ప్రతిపాదించింది.
 
మెరుగుపడుతున్న యూరప్ మార్కెట్లు..: యూరప్‌లో పరిస్థితులు మెరుగుపడుతుండటంతో అక్కడి మార్కెట్లలో వ్యాపారం లాభాల్లోకి మళ్లిందని ప్రసాద్ తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో అమెరికాలో 12, రష్యా తదితర దేశాలోల 14, భారత్‌లో 18 కొత్త ఔషధాలు ప్రవేశపెట్టినట్లు ఆయన వివరించారు. కొత్తగా 13 ఉత్పత్తులకు ఫైలింగ్ చేశామని, దీంతో అమెరికా ఎఫ్‌డీఏ వద్ద మొత్తం 68 ఏఎన్‌డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని ప్రసాద్ చెప్పారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయాలు 12% వృద్ధితో రూ. 14,818 కోట్లకు పెరగ్గా, లాభాలు 3% పెరుగుదలతో రూ. 2,218 కోట్లకు చేరాయి.

అమెరికాలో జనరిక్స్ ఆదాయం 17శాతం పెరిగి రూ. 6,472 కోట్లు, యూరప్‌లో 3% వృద్ధితో రూ. 719 కోట్లు, భారత్‌లో 14 శాతం వృద్ధితో రూ. 179 కోట్లు వచ్చాయి. కీలకమైన అమెరికా మార్కెట్లో ఔషధాలకు ఆమోదం లభించడంలో జాప్యం, భౌగోళిక-రాజకీయ అనిశ్చితి, వెనెజులా..రష్యా తదితర దేశాల్లో కరెన్సీ హెచ్చుతగ్గులు మొదలైన అంశాలు లాభాలపై ప్రతికూల ప్రభావం చూపాయని చక్రవర్తి తెలిపారు. చిన్న, మధ్య తరహా సంస్థల కొనుగోలుపై కసరత్తు జరుగుతూనే ఉందని ప్రసాద్ చెప్పారు. జపాన్ మార్కెట్లో భాగస్వామ్య సంస్థల కోసం అన్వేషిస్తున్నట్లు వివరించారు.
 
కొత్త పెట్టుబడి ప్రణాళికలు..: గత ఆర్థిక సంవత్సరం తరహాలోనే ఈసారి మరో రూ. 1,000-1,200 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రసాద్ చెప్పారు. ప్రధానంగా నాణ్యతను మెరుగుపర్చుకోవడం, కొత్త టెక్నాలజీలను సమకూర్చుకోవడం వంటి వాటిపై ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించారు. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై(ఆర్‌అండ్‌డీ) ఈసారి కూడా 12% పైనే వెచ్చించనున్నట్లు ప్రసాద్ తెలిపారు. బయోసిమిలర్ల విషయంలో మెర్క్ సంస్థతో కలసి పనిచేస్తున్నామని, 2018 నాటికి  మొదటిదాన్ని విడుదల చేసే అవకాశం ఉందని చెప్పారు.

శ్రీకాకుళం ప్లాంటును యూఎస్‌ఎఫ్‌డీఏ పరిశీలించిన నేపథ్యంలో.. నిబంధనల పాటింపునకు సంబంధించి అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. దీనిపై ఎఫ్‌డీఏ నుంచి ఇంకా స్పందన రావాల్సి ఉందన్నారు. అయితే, ముందు జాగ్రత్త చర్యగా కొన్ని ఔషధాల తయారీని శ్రీకాకుళం ప్లాంటు నుంచి ఇతర ప్లాంట్లకు తరలించినట్లు ప్రసాద్ వివరించారు.
ఫలితాల నేపథ్యంలో మంగళవారం బీఎస్‌ఈలో డాక్టర్ రెడ్డీస్
షేరు ధర 3 శాతం ఎగసి రూ.3,466 వద్ద స్థిరపడింది.

మరిన్ని వార్తలు