డిపాజిట్‌ ఉంటే.. కార్డిస్తారు!

28 Aug, 2017 00:22 IST|Sakshi
డిపాజిట్‌ ఉంటే.. కార్డిస్తారు!

క్రెడిట్‌ కార్డులు పొందటానికి ఈజీ మార్గం
క్రెడిట్‌ స్కోరు బాగులేని వారికిది అనుకూలమే
వేతన రుజువులు చూపించాల్సిన పనిలేదు
కాకపోతే డిపాజిట్‌లో 85 శాతం వరకే పరిమితి
ఇతర నిబంధనలు సాధారణ కార్డుల మాదిరే
తక్కువ వడ్డీకే డిపాజిట్‌ను కొనసాగిస్తుండాలి
ఈ పరిస్థితుల్లో అది ప్రతికూలమే: నిపుణులు
స్వయం ఉపాధి, స్థిరాదాయం లేనివారికీ బెటర్‌  


క్రెడిట్‌ కార్డు ఒకప్పుడు పెద్దగా అవసరం లేదనుకునేవారు. అప్పులకు భయపడేవారు కార్డులక్కూడా దూరంగానే ఉండేవారు. ఇక అప్పులు బాగా ఎక్కువైన వారికి కంపెనీలే కార్డులిచ్చేవి కాదు. కొన్నాళ్ల కిందటిదాకా ఇంచుమించు ఇదే పరిస్థితి ఉన్నా... పెద్ద నోట్లు రద్దు, వ్యవస్థలో నగదుకు కటకట ఏర్పడటం, వైద్య ఖర్చుల వంటివి భారీగా పెరగటం తదితర పరిణామాలతో క్రెడిట్‌ కార్డులకు సంబంధించి చాలా మార్పులొచ్చాయి. కార్డు వినియోగం, అవసరం బాగా పెరిగింది. అవసరానికి క్షణాల్లో అప్పు పుట్టించే ఈ కార్డులకు డిమాండూ పెరిగింది.

వేతన జీవులకు క్రెడిట్‌ కార్డు సులభంగానే లభిస్తుంది. స్థిరమైన ఆదాయం వస్తుంది గనుక వీరు అడగకుండానే... బ్యాంకులే స్వయంగా కార్డులు చేతిలో పెట్టే పరిస్థితి వచ్చింది. కానీ, అదే సమయంలో స్థిరమైన ఆదాయం లేని వారు, స్వయం ఉపాధిలో ఉన్నవారికి, క్రెడిట్‌ హిస్టరీ లేని వారికి క్రెడిట్‌ కార్డు లభించడం అంత సులభంగా లేదు. అయితే, వీరిక్కూడా ఓ మార్గం ఉంది. నిర్ణీత మొత్తం ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తే దానిపై క్రెడిట్‌ కార్డు తీసుకోవచ్చు. వీటిని సెక్యూర్డ్‌ క్రెడిట్‌ కార్డులుగా పరిగణిస్తున్నారు. యాక్సిస్‌ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్‌ మహింద్రా బ్యాంకు, బ్యాంకు ఆఫ్‌ బరోడా ఇలా ఎన్నో బ్యాంకులు ఎఫ్‌డీ చేస్తే ఇతర అర్హతలేవీ చూడకుండా క్రెడిట్‌ కార్డులు ఇచ్చేస్తున్నాయి. అందుకు గల విధి, విధానాలు ఒకసారి చూద్దాం...

అర్హతలు ఇవీ..
క్రెడిట్‌ కార్డు తీసుకుందామనుకున్న తర్వాత సంబంధిత బ్యాంకు వద్ద ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. డిపాజిట్‌ సమయంలో బ్యాంకు అవసరమైన పత్రాలను తీసుకుంటుంది. కనుక క్రెడిట్‌ కార్డు సమయంలో ఇతరత్రా పత్రాలేవీ సమర్పించాల్సిన అవసరం ఉండదు. దరఖాస్తు ఒక్కటి మాత్రం సరిపోతుంది. ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు కనీసం రూ.20,000 డిపాజిట్‌ను అడుగుతున్నాయి. కోటక్‌ మహింద్రా బ్యాంకు, బ్యాంకు ఆఫ్‌ బరోడా అయితే రూ.25,000 డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా ఎంత మేరకైనా డిపాజిట్‌ చేయవచ్చు. ఒక్క యాక్సిస్‌ బ్యాంకు మాత్రం గరిష్ట డిపాజిట్‌ రూ.25 లక్షలుగా పరిమితి నిర్దేశించింది. డిపాజిట్‌ చేయాల్సిన కాల వ్యవధి ఐసీఐసీఐ కోరల్‌ లేదా ఇన్‌స్టంట్‌ ప్లాటినమ్‌ కార్డులకు 180 రోజులుగా ఉంది. సెంట్రల్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా నుంచి యాస్పైర్‌ క్రెడిట్‌ కార్డు పొందాలంటే సెంట్‌ యాస్పైర్‌ టర్మ్‌ డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది.

పరిమితులు కూడా ఉన్నాయ్‌...
డిపాజిట్‌పై తీసుకునే క్రెడిట్‌ కార్డుల విషయంలోనూ కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. యాక్సిస్‌ బ్యాంకు మైనర్ల పేరిట డిపాజిట్‌ చేసినప్పటికీ క్రెడిట్‌ కార్డులిచ్చేందుకు ముందుకు రావడం లేదు. ఇదే బ్యాంకులో ఫ్లెక్సీ డిపాజిట్, ట్యాక్స్‌ సేవర్‌ డిపాజిట్లు చేసినట్టయితే వాటిపైనా కార్డులను జారీ చేయడం లేదు. ఐసీఐసీఐ బ్యాంకు థర్డ్‌పార్టీకి, భాగస్వామ్య సంస్థలు తదితర వర్గాలకు క్రెడిట్‌ కార్డులు ఇవ్వడం లేదు. అలాగే, తనఖాలో ఉంచిన డిపాజిట్లపై కూడా క్రెడిట్‌ కార్డులు జారీ చేయడం లేదు. చాలా బ్యాంకులు డిపాజిట్‌ మొత్తంలో 80 శాతం విలువకు సమానమైన క్రెడిట్‌ లిమిట్‌ (రుణ పరిమితి) ఇవ్వటానికే మొగ్గు చూపిస్తున్నాయి. ఆ మేరకే కార్డులు మంజూరు చేస్తున్నాయి. ఉదాహరణకు రూ.1 లక్ష డిపాజిట్‌ చేసి ఉంటే రూ.80,000 వరకు లిమిట్‌తో క్రెడిట్‌ కార్డును తేలిగ్గా పొందొచ్చు. కొన్ని బ్యాంకులు కార్డులపై క్రెడిట్‌ లిమిట్‌ను కూడా పరిమితం చేస్తున్నాయి. కోటక్‌ మహింద్రా బ్యాంకు ఆక్వాగోల్డ్‌ కార్డ్‌పై గరిష్టంగా రూ.12 లక్షలకే క్రెడిట్‌ లిమిట్‌ను ఖరారు చేసింది. అంటే డిపాజిట్‌ రూ.50 లక్షలు చేసినా, రూ.12 లక్షలకే క్రెడిట్‌ లిమిట్‌తో కార్డు ఇస్తుంది. సెంట్రల్‌బ్యాంకు యాస్పైర్‌ క్రెడిట్‌ కార్డుపై రూ.10 లక్షల గరిష్ట పరిమితి ఉంది.

చార్జీలు, వడ్డీ రేట్లు మామూలే!
క్రెడిట్‌ కార్డు కాల వ్యవధి, ఫీజులు, వడ్డీ రేటు, ఇతర చార్జీలన్నీ కూడా వీటికీ సాధారణ క్రెడిట్‌కార్డుల మాదిరిగానే అమల్లో ఉన్నాయి. రుణ కాల వ్యవధి 30 నుంచి 60 రోజుల వరకు ఉంది. సకాలంలో చెల్లింపులు చేయకపోతే ఆలస్య రుసుం, వడ్డీ పడుతుంది. ఈ కార్డుల వల్ల బ్యాంకులకు ఉన్న వెసులుబాటు కార్డు దారుడు రుణం తీసుకుని చెల్లించకపోతే డిపాజిట్‌ నుంచి రికవరీ చేసుకుంటాయి. ఐసీఐసీఐ బ్యాంకు అయితే క్రెడిట్‌ కార్డుపై తీసుకున్న రుణం గనక డిపాజిట్‌ విలువకు చేరినట్లయితే వెంటనే డిపాజిట్‌ను రద్దు చేసి రుణం కింద జమ చేసుకుంటోంది. క్రెడిట్‌ కార్డు కాలవ్యవధి అన్నది డిపాజిట్‌ కాలవ్యవధిపైనే ఆధారపడి ఉంటుంది. క్రెడిట్‌ కార్డులకు హామీగా ఉన్న డిపాజిట్లను బ్యాంకులు సాధారణంగా ఆటో రెన్యువల్‌ మోడ్‌లో ఉంచుతాయి.

అంటే గడువు తీరిన తర్వాత డిపాజిట్లు తిరిగి పునరుద్ధరిస్తూ ఉంటాయి. డిపాజిట్‌ మెచ్యూరిటీ అయిన తర్వాత కూడా క్రెడిట్‌ కార్డును వాడుకోవాలని అనుకునేవారు దానిపై తనఖా మార్కును తీసేసి అన్‌ సెక్యూర్డ్‌ క్రెడిట్‌ కార్డు కిందకు మార్చాలంటూ బ్యాంకులను కోరవచ్చనేది రుబిక్యూ ఎండీ, సీఈవో మానవ్‌జీత్‌ సూచన.  అయితే, మీ క్రెడిట్‌ స్కోరు, ఇతర అంశాల ఆధారంగా క్రెడిట్‌ పరిమితిని సవరించే అవకాశం ఉంటుంది. ‘‘డిపాజిట్‌పై క్రెడిట్‌ కార్డు తీసుకున్నాక చెల్లింపులు సకాలంలో చేయడం ద్వారా కాల వ్యవధి ముగిసే నాటికి మంచి క్రెడిట్‌ స్కోరును సంపాదించొచ్చు. దాంతో సాధారణ కార్డుకు దరఖాస్తు చేసుకునే అర్హత లభిస్తుంది’’ అని క్రెడిట్‌ మంత్రి సీఈఓ రంజిత్‌ పుజా తెలియజేశారు.

ఈ కార్డులు ఎవరికి అనుకూలం?
ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై క్రెడిట్‌ కార్డులు మూడు వర్గాల వారికి అనువైనవన్నది నిపుణుల మాట. క్రెడిట్‌ హిస్టరీ లేకుండా, అప్పటి వరకు ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకోని వారికి ఇవి అనువైనవి. వీరు డిపాజిట్‌పై కార్డు తీసుకుని అవసరాలు తీర్చుకోవడంతో పాటు క్రెడిట్‌ స్కోర్‌ను కూడా సాధించుకునే వీలుంటుంది. అలాగే, తక్కువ క్రెడిట్‌ స్కోరు ఉండి, రుణం పొందడానికి అడ్డంకిగా ఉన్న వారికి సైతం ఇవి అనుకూలం. స్థిరమైన ఆదాయం లేని వారికి కూడా ఇవి అనువైనవేనని లోన్‌ట్యాప్‌ సహ వ్యవస్థాపకుడు వికాస్‌ కుమార్‌ తెలియజేశారు. చిన్న వ్యాపారాల్లో, స్వయం ఉపాధిలో ఉండి అస్థిరమైన ఆదాయం కలిగిన వారు, క్రెడిట్‌ కార్డు కావాలనుకుంటే డిపాజిట్‌ చేసి సులభంగా కార్డు తీసుకోవచ్చని సూచించారు. అయితే, కార్డు పొందాలంటే ముందుగా డిపాజిట్‌ చేయడంతోపాటు దాన్ని లాకిన్‌లో ఉంచడం మాత్రం ప్రతికూలమే.

మరిన్ని వార్తలు