ఐషర్‌ మోటార్స్‌ లాభం రూ. 520 కోట్లు

8 Feb, 2018 01:17 IST|Sakshi

న్యూఢిల్లీ: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లు, ఇతర వాణిజ్య వాహనాలు తయారు చేసే ఐషర్‌ మోటార్స్‌ కంపెనీ... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.520 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత క్యూ3లో సాధించిన నికర లాభం రూ.418 కోట్లతో పోలిస్తే 24 శాతం వృద్ధి సాధించామని ఐషర్‌ మోటార్స్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,071 కోట్ల నుంచి రూ.2,269 కోట్లకు పెరిగిందని కంపెనీ సీఈఓ, ఎండీ సిద్ధార్థ లాల్‌ పేర్కొన్నారు.

నిర్వహణ లాభం 23 శాతం వృద్ధితో రూ.707 కోట్లకు పెరిగిందని, మార్జిన్‌ 31.2 శాతంగా నమోదైందని తెలిపారు. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ అమ్మకాలు 19 శాతం వృద్ధితో 2,06,000కు పెరిగాయని గత క్యూ3లో 27 శాతంగా ఉన్న ఈ బైక్‌ల మార్కెట్‌ వాటా ఈ క్యూ3లో 31 శాతానికి పెరిగిందని తెలిపారు. ఎగుమతులు 68 శాతం వృద్ధి చెందాయని వివరించారు. ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో బీఎస్‌ఈ ఇంట్రాడేలో ఈ షేర్‌ 3 శాతం వరకూ ఎగసి, చివరకు 1 శాతం లాభంతో రూ.27,911 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు