ఎలక్ట్రిక్ వాహనాలు తెస్తాం..

1 Nov, 2016 00:25 IST|Sakshi
ఎలక్ట్రిక్ వాహనాలు తెస్తాం..

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో :  లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీకి చెందిన మెర్సిడెస్ బెంజ్ భారత్‌లో కొత్త అధ్యాయానికి రెడీ అవుతోంది. డీజిల్, పెట్రోల్ కార్లను దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న ఈ సంస్థ.. ఫుల్ ఎలక్ట్రిక్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వాహనాలను సైతం ప్రవేశపెట్టాలని కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటికే పలు దేశాల్లో కంపెనీ ఈ మోడళ్లను విజయవంతంగా విక్రయిస్తోంది. భారత్‌లో వాహనాల నుంచి వెలువడుతున్న వాయు కాలుష్యం పట్ల కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. బీఎస్-5కు బదులుగా, బీఎస్-6 ప్రమాణాలను 2020 నుంచే అమలు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాము సైతం మార్కెట్‌కు అనుగుణంగా వ్యవహరిస్తామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ రోలాండ్ ఎస్ ఫాల్గర్ తెలిపారు. సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంస్థ భవిష్యత్ కార్యాచరణ ఆయన మాటల్లోనే..
 
 వాహనాలు రెడీ..
 పలు దేశాల్లో ఎలక్ట్రికల్, హైబ్రిడ్ మోడళ్లను విజయవంతంగా అమ్ముతున్నాం. ఈ వాహనాల విభాగంలో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాం. ప్రధానంగా భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఫ్యూచర్ టెక్నాలజీపై భారీగా వ్యయం చేశాం. భారత్‌లో ఏటా 30 లక్షలకుపైగా పెట్రోలు, డీజిల్ కార్లు అమ్ముడవుతున్నాయి. పర్యావరణం పట్ల ఇక్కడి కస్టమర్లకు బాగా అవగాహన ఉంది. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహన రంగంలో దేశంలో అపార అవకాశాలు ఉన్నాయనడంలో సందేహం లేదు. మార్కెట్‌లో ఉన్న అవకాశాలను వాహన కంపెనీలు ఇంకా రుచి చూడాల్సి ఉంది. మెర్సిడెస్ విషయానికి వస్తే భవిష్యత్ తరం మోడళ్లను ఏ క్షణంలోనైనా భారత విపణిలో ఆవిష్కరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అయితే అందుకు మార్కెట్ రెడీగా లేదు.
 
 కీలక పాత్ర ప్రభుత్వానిదే..
 దేశంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్ల కొనుగోళ్లకు కస్టమర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. చార్జింగ్ స్టేషన్లు ఎక్కడా ఏర్పాటు కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. పైగా ఈ మోడళ్ల ఖరీదు ఎక్కువ. తక్కువ యూనిట్ల అమ్మకాల కారణంగానే ధర కాస్త అధికంగా ఉంటోంది. చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు బాధ్యత వాహన కంపెనీలదే అన్న భావన ప్రభుత్వానిది. వాస్తవానికి ఇంధన సంస్థలే చొరవ చూపాలి. ఈ విషయంలో ప్రభుత్వమూ కీలకంగా వ్యవహరించాలి. చార్జింగ్ స్టేషన్లు విరివిగా ఏర్పాటైతేనే ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లకు డిమాండ్ పెరుగుతుంది. ఇదంతా ఒక్క రోజులో అయ్యే పని కాదు. అమ్మకాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వాలి. కస్టమర్లు ఎలక్ట్రికల్, హైబ్రిడ్ వాహనాల పట్ల ఆకర్శితులయ్యేలా ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి. తయారీ వ్యయం కంటే తక్కువకు నష్టానికి మేం వాహనాలను విక్రయించలేం కదా.
 
 రెండేళ్లలో బీఎస్-6..
 భారత్ స్టేజ్-6 ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను ప్రవేశపెట్టేందుకు మేం రెడీగా ఉన్నాం. అది కూడా 2018 కల్లా కంపెనీ సిద్ధం. ప్లాంటును అందుకు తగ్గట్టుగా మార్పులు చేస్తాం. నూతన ప్రమాణాలు రానున్న రోజుల్లో కంపెనీకి ప్రయోజనం చేకూరుస్తాయి. బీఎస్-6 అమలుకు ప్రభుత్వ తోడ్పాటు అవసరం. ధ్రువీకరణ విధానం వేగిరం చేయడంతోపాటు నాణ్యమైన ఇంధనం అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టాలి.
 

మరిన్ని వార్తలు