రెండింట ఒకటి ఎలక్ట్రిక్‌

4 Nov, 2023 04:32 IST|Sakshi

54 శాతానికి ఈ–త్రీవీలర్లు  

అక్టోబర్‌లో 58 శాతం వృద్ధి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశవ్యాప్తంగా అక్టోబర్‌లో ప్యాసింజర్, కార్గో విభాగంలో 1,04,712 యూనిట్ల త్రిచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. ఇందులో 54 శాతం వాటాతో ఎలక్ట్రిక్‌ త్రిచక్ర వాహనాలు 56,818 యూనిట్లు నమోదయ్యాయి. 2022 అక్టోబర్‌తో పోలిస్తే ఈ–త్రీవీలర్ల విక్రయాలు గత నెలలో 58 శాతం పెరగడం విశేషం. 2023 జనవరిలో అమ్ముడైన 70,929 త్రిచక్ర వాహనాల్లో ఎలక్ట్రిక్‌ వాటా 48 శాతం ఉంది.

2023 జనవరి–అక్టోబర్‌ మధ్య ఈ–త్రీవీలర్లు 4,71,154 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2022 అక్టోబర్‌తో ముగిసిన 10 నెలల్లో ఈ సంఖ్య 2,74,245 యూనిట్లు మాత్రమే. అంటే ఏడాదిలో ఈ–త్రీవీలర్ల విక్రయాలు 72 శాతం పెరిగాయన్న మాట. 2023 జనవరి–అక్టోబర్‌ కాలంలో దేశవ్యాప్తంగా 8,81,355 యూనిట్ల త్రిచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. దీనినిబట్టి రోడ్డెక్కుతున్న త్రిచక్ర వాహనాల్లో రెండింటిలో ఒకటి ఎలక్ట్రిక్‌ మోడల్‌ ఉంటోందంటే మార్కెట్‌ తీరుతెన్నులను అర్థం చేసుకోవచ్చు.  

పోటీలో 475 కంపెనీలు..
నిర్వహణ వ్యయం తక్కువ కావడంతో ఎలక్ట్రిక్‌ త్రిచక్ర వాహనాలకు క్రమంగా భారత్‌లో ఆదరణ పెరుగుతోంది. ఆటోరిక్షా డ్రైవర్లు, ఫ్లీట్‌ ఆపరేటర్ల నుంచి వీటికి డిమాండ్‌ ఊపందుకుంది. 2023 జనవరిలో 34,333 యూనిట్ల ఈ–త్రీవీలర్లు అమ్ముడయ్యాయి. జూలై నుంచి ప్రతి నెల 50 వేల పైచిలుకు యూనిట్ల ఎలక్ట్రిక్‌ త్రిచక్ర వాహనాలు కస్టమర్ల చేతుల్లోకి వెళ్తున్నాయి. భారత్‌లో 475 కంపెనీలు ఈ–త్రీవీలర్ల మార్కెట్లో పోటీ పడుతున్నాయంటే ఆశ్చర్యం వేయక మానదు.

అక్టోబర్‌లో మహీంద్రా లాస్ట్‌ మైల్‌ మొబిలిటీ తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వైసీ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్, సేయిరా ఎలక్ట్రిక్‌ ఆటో, పియాజియో వెహికిల్స్‌ నిలిచాయి. అక్టోబర్‌ అమ్మకాల్లో టాప్‌–12 కంపెనీల వాటా 43 శాతం నమోదైంది. ఇటీవలే ఈ విభాగంలోకి ఎంట్రీ ఇచి్చన బజాజ్‌ ఆటో అయిదు నెలల్లో 2,080 యూనిట్లను విక్రయించింది. 124 యూనిట్లతో మొదలై అక్టోబర్‌లో 866 యూనిట్ల స్థాయికి చేరుకుంది.  

త్రీవీలర్లు 40 శాతం..
దేశవ్యాప్తంగా 2023 అక్టోబర్‌లో అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 1,39,232 యూనిట్ల ఎలక్ట్రిక్‌ వాహనాలు అమ్ముడయ్యాయి. ఇందులో ఈ–త్రీవీలర్ల వాటా ఏకంగా 40 శాతానికి ఎగబాకింది. 2022లో 1,17,498 ఈవీలు రోడ్డెక్కాయి. ఇందులో 30 శాతం వాటాతో 35,906 యూనిట్ల ఈ–త్రీవీలర్లు ఉన్నాయి. 2023 జనవరి–అక్టోబర్‌ మధ్య అమ్ముడైన 12.3 లక్షల యూనిట్ల ఈవీల్లో ఈ–త్రీవీలర్లు 38 శాతం ఉన్నాయి. ఇక 2022లో 3,50,238 యూనిట్ల ఈ–త్రీవీలర్లు రోడ్డెక్కాయి. ప్రస్తుత వేగాన్నిబట్టి చూస్తే ఈ ఏడాది 57 శాతం వృద్ధితో 5,50,000 యూనిట్ల మార్కును దాటడం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు