అప్పుడు ఈఎల్‌ఎస్‌ఎస్‌లు ఆకర్షణీయం కాదు

12 Nov, 2018 02:09 IST|Sakshi

నేను గత కొంతకాలంగా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. నా పోర్ట్‌ఫోలియోలో 3 లేదా 4 మ్యూచువల్‌ ఫండ్స్‌ కంపెనీలకు చెందిన ఫండ్స్‌ ఉన్నాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌కు సంబంధించి ఒక ఆర్థిక సంవత్సరంలో దీర్ఘకాలిక మూలధన లాభాలపై రూ. 1 లక్ష వరకూ మి నహాయింపు ఉంది కదా ! ఈ మినహాయింపు అన్నింటికీ కలిపి వర్తిస్తుం దా ? ఒక్కో మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ ఇన్వెస్ట్‌మెంట్స్‌కే వర్తిస్తుందా ?   –రవీందర్, విజయవాడ  
అన్నింటికీ కలిపి వర్తిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ షేర్లు, ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్ల విక్రయాలపై వచ్చిన లాభాలపై రూ. లక్ష వరకూ మినహాయింపు ఉంటుంది. ఒక వేళ ఒక ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ, మ్యూచువల్‌ ఫండ్ల విక్రయాలపై దీర్ఘకాల మూలధన  లాభాలు రూ. లక్షకు మించాయనుకోండి.

మీరు రూ. లక్షకు మించిన లాభాలపై 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీకు ఒక ఆర్థిక సంవత్సరంలో  రూ. లక్షన్నర దీర్ఘకాలిక మూలధన లాభాలు వచ్చాయనుకుందాం. మినహాయింపు రూ. 1 లక్ష పోను, రూ.50,000పై 10 శాతం చొప్పున రూ.5,000 దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీర్ఘకాలంలో ఈక్విటీ, ఫండ్స్‌పై మంచి రాబడులే వస్తాయి కాబట్టి, ఈ 10 శాతం పన్ను విషయమై భయపడాల్సిన పని లేదు.  

నా వయస్సు 50 సంవత్సరాలు. నేను మొత్తం ఆరు మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేశాను. అవి...ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఈక్విటీ, ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ మనీ మేనేజర్, ఎల్‌ అండ్‌ టీ ట్యాక్స్‌ అడ్వాండేజ్, రిలయన్స్‌ ఈక్విటీ హైబ్రిడ్, రిలయన్స్‌ లార్జ్‌ క్యాప్, ఎస్‌బీఐ బ్లూ చిప్‌లు. ఇది డైవర్సిఫైడ్‌ పోర్ట్‌ఫోలియో అవునా? కాదా ? నేను మరో పదేళ్ల వరకూ ఇన్వెస్ట్‌ చేయగలను. ఈ ఫండ్స్‌ యూనిట్లను విక్రయించి,  సిస్టమేటిక్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్లాన్‌(ఎస్‌టీపీ) ద్వారా వివిధ మ్యూచువల్‌ ఫండ్స్‌కు చెందిన ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. దీని కోసం ముందుగా వివిధ మ్యూచువల్‌ ఫండ్స్‌కు చెందిన  లిక్విడ్‌ ఫండ్స్‌లోకి నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేసి ఆ తర్వాత ఈక్విటీ ఫండ్స్‌లోకి మార్చుకోమంటారా?   –ఫిలిప్స్, సికింద్రాబాద్‌  
మీరు మీ పోర్ట్‌ఫోలియోను మరింత సరళం చేయాల్సిన అవసరం ఉంది. దీని కోసం మీ పోర్ట్‌ఫోలియోలో 2–3 మల్టీక్యాప్‌ ఫండ్స్‌ ఉంటే సరిపోతుంది. ఇక మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఈక్విటీ ఫండ్స్‌లోకి ఎస్‌టీపీ ద్వారా  బదిలీ చేసుకోవచ్చు. ప్రస్తుతం మీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఇన్వెస్ట్‌మెంట్స్‌ అన్నింటినీ, వివిధ మ్యూచువల్‌ ఫండ్స్‌కు చెందిన వివిధ లిక్విడ్‌ ఫండ్స్‌లోకి కాకుండా ఒకే లిక్విడ్‌ ఫండ్‌లోకి మార్చుకోండి.

ఈ ఫండ్‌ నుంచి ఎస్‌డబ్ల్యూపీ (సిస్టమేటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌) ద్వారా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మీ బ్యాంక్‌ ఖాతాలోకి వచ్చేలా చూసుకోండి.  ఈ బ్యాంక్‌ ఖాతా నుంచి సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) ప్లాన్‌ ద్వారా 2–3 మంచి ఈక్విటీ ఫండ్స్‌లోకి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేసుకోండి. ఈ విధంగా ఒక్కసారి సూచనలు ఇస్తే, ప్రతి నెలా ఆటోమేటిక్‌గా లిక్విడ్‌ ఫండ్‌ నుంచి ఎస్‌డబ్ల్యూపీ ద్వారా విక్రయాలు జరిగి, సిప్‌ ద్వారా ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ వెళ్లిపోతాయి.  

చాలా మంది పన్ను ప్రయోజనాల కోసమే ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌(ఈఎల్‌ఎస్‌ఎస్‌)లో ఇన్వెస్ట్‌ చేస్తారు. అయితే నాకు పన్ను ఆదా చేయాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా ? –బషీర్, విశాఖ పట్టణం  
జ: మీరు ఈఎల్‌ఎస్‌ఎస్‌లో ఇన్వెస్ట్‌ చేసినా, మరే ఇతర మల్టీక్యాప్‌ ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసినా ఒకటే తేడా ఉంటుంది. ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ మూడేళ్ల వరకూ లాక్‌–ఇన్‌ అవుతాయి. మల్టీక్యాప్‌ ఈక్విటీ ఫండ్స్‌కు ఎలాంటి లాక్‌ ఇన్‌ పీరియడ్‌ ఉండదు. ఈఎల్‌ఎస్‌ఎస్‌లకు ఈ మూడేళ్ల లాక్‌–ఇన్‌ పీరియడ్‌ నిబంధన కారణంగా ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్‌ మేనేజర్‌పై రిడంప్షన్‌(ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్లను విక్రయించడం) ఒత్తిడి ఉండదు. ఫలితంగా సదరు ఫండ్‌ మేనేజర్‌ దీర్ఘకాలం దృష్ట్యా ఇన్వెస్ట్‌మెంట్స్‌ వ్యూహాన్ని అమలు చేస్తాడు.

అయితే సాధారణ మ్యూచువల్‌ ఫండ్స్‌కంటే ఈఎల్‌ఎస్‌ఎస్‌లు మంచి రాబడులు ఇచ్చిన దాఖలాలు పెద్దగా లేవు. పన్ను ప్రయోజనాలు ప్రాధాన్యం కానప్పుడు ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయడం సరైన నిర్ణయం కాదు. ఎందుకు అనవసరంగా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ మూడేళ్ల వరకూ లాక్‌ అయి ఉండటం ?మీరు ఎంచుకోవడానికి ఎన్నో ఫండ్స్‌ అందుబాటులో ఉన్నాయి కదా ! క్రమం తప్పకుండా దీర్ఘకాలం పాటు మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు.

ఏదైనా మంచి ఈక్విటీ ఫండ్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తే, మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల(రిటైర్మెంట్‌ నిధి ఏర్పాటు, సొంత ఇల్లు సమకూర్చుకోవడం, పిల్లల ఉన్నత చదువులు)ను సునాయాసంగా సాధించవచ్చు. పన్ను ఆదా మీకు అవసరం లేని విషయమైతే, మీరు లిక్విడిటీ విషయమై  ఎందుకు అనవసరంగా  రాజీ పడటం ? అందుకని పన్ను ఆదా చేయాల్సిన అవసరం లేనప్పుడు ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకున్న మీ నిర్ణయం సరైనది కాదని చెప్పవచ్చు.


ధీరేంద్ర కుమార్‌
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

మరిన్ని వార్తలు