ఇలా ఇన్వెస్ట్‌ చేస్తే.. అధిక ప్రయోజనాలు

4 Oct, 2023 10:47 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇప్పటికే మార్కెట్లు కొంత మేర ర్యాలీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల రీత్యా వచ్చే ఆరు నెలల నుంచి ఏడాది వ్యవధి వరకూ మార్కెట్లలో ఇన్వెస్టర్లు విడతలవారీగా, కొద్దికొద్దిగా ఇన్వెస్ట్‌ చేయడాన్ని పరిశీలించవచ్చని ఎడెల్వీజ్‌ మ్యుచువల్‌ ఫండ్‌ సీఐవో (ఈక్విటీస్‌) త్రిదీప్‌ భట్టాచార్య సూచించారు.

పడినప్పుడల్లా కొనుగోలు చేసే విధానాన్ని పాటించవచ్చన్నారు. గత కొద్ది నెలలుగా ర్యాలీ చేసిన కొన్ని మిడ్, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌పై అసంబద్ధ మైన స్థాయిలో ఆసక్తి నెలకొందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వివిధ స్థాయుల క్యాపిటలైజేషన్‌ గల స్టాక్స్‌లో మదుపు చేసే మల్టీక్యాప్‌ ఫండ్స్‌లాంటి వాటిలో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా అధిక ప్రయోజనాలు పొందేందుకు ఆస్కారం ఉంటుందని భట్టాచార్య చెప్పారు.

 

కొత్తగా ఎడెల్వీజ్‌ మల్టీక్యాప్‌ ఫండ్‌ ఎన్‌ఎఫ్‌వో బుధవారం (సెప్టెంబర్‌ 4) నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన ఈ విషయాలు తెలిపారు. అక్టోబర్‌ 18 వరకు ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయొచ్చు. వచ్చే 3-4 ఏళ్లు ప్రధానంగా అయిదు థీమ్స్‌ మార్కెట్లకు దన్నుగా నిల్చే అవకాశం ఉందని భట్టాచార్య తెలిపారు. తయారీ రంగం, ఆర్థిక సేవలకు సంబంధించి రుణాల విభాగం, డిఫెన్స్, రియల్‌ ఎస్టేట్‌ మొదలైనవి వీటిలో ఉంటాయని భట్టాచార్య పేర్కొన్నారు. ఆదాయాల్లో విదేశీ మార్కెట్ల వాటా ఎక్కువగా ఉన్న రంగాల సంస్థలపై అండర్‌వెయిట్‌గా ఉన్నామని ఆయన చెప్పారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

మరిన్ని వార్తలు