ఫేస్‌బుక్‌లో కొత్తగా ఉద్యోగాలు: వాటికోసమే..

3 Oct, 2017 11:32 IST|Sakshi

వ్యాపార ప్రకటనల విషయంతో తీవ్ర విమర్శలు పాలవుతున్న సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ తన అడ్వర్‌టైజింగ్‌ సిస్టమ్‌ను‌, ప్లాన్లను మార్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు తమ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామలో వచ్చే వ్యాపార ప్రకటనలను సమీక్షించడానికి కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటోంది. 1000 మందికి పైగా ఉద్యోగులను ఫేస్‌బుక్‌ తన వ్యాపార ప్రకటనలను సమీక్షించడానికి తీసుకుంటున్నట్టు తెలిసింది. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయం ఉందనే దానిపై కాంగ్రెస్‌ విచారణ చేపట్టిన నేపథ్యంలో ఫేస్‌బుక్‌ ఈ నిర్ణయం తీసుకుంది. 

ఆ ఎన్నికల సందర్భంగా ఫేస్‌బుక్‌లో రష్యన్ యాడ్స్ ఎక్కువగా ఉండటంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అవి ట్రంప్‌కు అనుకూలంగా వచ్చాయని లిబరల్స్‌ ఆరోపిస్తుండగా... ట్రంప్‌ మాత్రం ఫేస్‌బుక్‌ను యాంటీ ట్రంప్‌గా అభివర్ణిస్తున్నారు. ఈ ప్రకటనల కోసం ఫేస్‌బుక్‌ లక్షకు పైగా డాలర్లను తీసుకుంది. తమపై వస్తున్న ఈ ఆరోపణలకు గాను, ఎవరినైనా బాధించి ఉంటే మన్నించడంటూ ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ నిన్ననే(సోమవారమే) క్షమాపణ కూడా చెప్పారు. రాజకీయ ప్రకటన ఖర్చు నిబంధనలను సమగ్రంగా సమీక్షించనున్నామని జుకర్‌ బర్గ్‌ తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడానికి తమ టూల్స్‌ను ఎవరూ వాడుకోవడానికి వీలులేదంటూ పేర్కొన్నారు. ప్రకటన కొనుగోలు ప్రక్రియలో కూడా ఫేస్‌బుక్‌ పలు అప్‌డేట్లను ప్రవేశపెట్టింది. కంటెంట్‌పై కఠినతరమైన నిబంధనలు తీసుకురావడం, అడ్వర్‌టైజర్లు తమ ప్రామాణికతను ప్రదర్శించడానికి నిబంధనలను మెరుగుపరచడం వంటి వాటిని తీసుకొచ్చింది. 

మరిన్ని వార్తలు