ప్రతి మొబైల్‌పై బహుమతి

14 Jul, 2018 00:24 IST|Sakshi

సెలెక్ట్‌ మొబైల్స్‌ ఫౌండర్‌ వై.గురు

ఏడాదిలో 200 స్టోర్లు ప్రారంభిస్తాం

మూడేళ్లలో 10,000 మందికి ఉపాధి

కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా తారక్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మల్టీ బ్రాండ్‌ మొబైల్స్‌ రిటైల్‌ చైన్‌ సెలెక్ట్‌ మొబైల్స్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా సినీ నటుడు జూనియర్‌ ఎన్టీయార్‌ నియమితులయ్యారు. రెండేళ్లపాటు ఆయన ప్రచారకర్తగా వ్యవహరిస్తారని సెలెక్ట్‌ ఫౌండర్‌ వై.గురు శుక్రవారమిక్కడ తెలిపారు. కంపెనీ డైరెక్టర్‌ మురళి రేతినేనితో కలసి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

జూలై 20న తెలంగాణలో 30 స్టోర్లు ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ‘2019 జూలై నాటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో 200 ఔట్‌లెట్లు అందుబాటులోకి రానున్నాయి. 2,500 మందికి ఉపాధి లభిస్తుంది. ఆ తర్వాతి రెండేళ్లలో మరో 500ల కేంద్రాలు తెరుస్తాం. మొత్తం 10,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తాం. మూడేళ్లలో టర్నోవర్‌ రూ.2,500 కోట్లు ఆశిస్తున్నాం’ అని వెల్లడించారు. ఒక్కో స్టోర్‌కు కంపెనీ రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి వరకు వ్యయం చేస్తోంది.

ఎక్స్‌పీరియెన్స్‌ జోన్‌లో..
వర్చువల్‌ సేల్స్‌ అసిస్టెన్స్‌తో కూడిన ప్రత్యేక ఎక్స్‌పీరియెన్స్‌ జోన్‌ సెలెక్ట్‌ స్టోర్లలో ఆకర్షణగా నిలుస్తోంది. ఒకేసారి ఎనమిది స్మార్ట్‌ఫోన్ల ఫీచర్లను జోన్‌లో ఉన్న భారీ టచ్‌ స్క్రీన్‌పై పోల్చుకోవచ్చు. డిస్‌ప్లేలో ఉన్న మొబైల్స్‌ నుంచి తీసిన ఫోటోలు ఒక్క స్వైప్‌తో టచ్‌ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. భారత్‌లో తొలిసారిగా దీనిని ప్రవేశపెట్టారు.

ఈ టెక్నాలజీని అమలు చేయడమే కంపెనీ విజయంగా భావిస్తున్నట్టు మురళి రేతినేని తెలిపారు. ఆన్‌లైన్‌ కస్టమర్లనూ ఆఫ్‌లైన్‌ వైపు వచ్చేలా చేస్తోందన్నారు. 1,000 చదరపు అడుగులపైగా విస్తీర్ణం ఉన్న స్టోర్లలోనే దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. ఎక్స్‌పీరియెన్స్‌ జోన్‌ తననూ ఆకట్టుకుందని తారక్‌ వ్యాఖ్యానించారు.

తగ్గిన ఆన్‌లైన్‌ సేల్స్‌..
దక్షిణాదిన, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఆన్‌లైన్‌ సేల్స్‌ తగ్గుతున్నాయి. వ్యవస్థీకృత రిటైల్‌ చైన్లు ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణమని గురు తెలిపారు. ‘మొబైల్స్‌ అమ్మకాల్లో దేశవ్యాప్తంగా వ్యవస్థీకృత రంగం వాటా 13 శాతమే. తెలుగు రాష్ట్రాల్లో ఇది ఏకంగా 50 శాతముంది. దక్షిణాది 25 శాతం కైవసం చేసుకుంది’ అని పేర్కొన్నారు.

ఇక పాపులర్‌ గ్యాడ్జెట్స్‌ విక్రయంపైనా ఫోకస్‌ చేస్తున్నా మని గురు తెలిపారు. ప్రతి మొబైల్‌పై ఖచ్చితమైన బహుమతి అందిస్తున్నట్టు చెప్పారు. ‘ధర విషయంలో ఆన్‌లైన్‌కు పోటీ ఇస్తున్నాం. రూ.3,000ల ఫోన్‌కూ ఈఎంఐ ఆఫర్‌ చేస్తున్నాం. విక్రయాల్లో ఈ ఎంఐ వాటా 50 శాతం ఉంది’ అని వివరించారు.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా