కీలక మద్దతు పైనే పసిడి!

18 Dec, 2017 01:47 IST|Sakshi

వారంలో ఎనిమిది డాలర్ల పెరుగుదల

1,258 డాలర్ల వద్ద ముగింపు

అంతర్జాతీయ న్యూయార్క్‌ కమోడిటీ  ఎక్సే్ఛంజ్‌ నైమెక్స్‌లో పసిడి ఔన్స్‌ (31.1గ్రా) ధర 16వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో 8 డాలర్లు పెరిగింది. మూడు వారాల పతనానికి ఇది బ్రేక్‌.  అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల నిర్ణయం నేపథ్యంలో  వారం మధ్యన ఒక దశలో 1,239 డాలర్లకు పడిపోయిన పసిడి మళ్లీ వారం చివరకల్లా 1,258 డాలర్లను చేరింది.

అమెరికా పారిశ్రామిక ఉత్పత్తి నవంబర్‌లో ఊహించినంతగా నమోదుకాకపోవడం దీనికి నేపథ్యం. వారం మొత్తంలో కూడా డాలర్‌ ఇండెక్స్‌ 0.12 సెంట్లు బలపడి 93.96కు చేరింది. అమెరికా పన్ను సంబంధ నిర్ణయాలు, ఆ దేశ ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం వంటి అంశాలు సమీప కాలంలో పసిడిపై ప్రభావాన్ని చూపిస్తాయన్నది నిపుణుల వాదన. 1,200 డాలర్ల స్థాయిలో పసిడి కొనుగోళ్లకు అవకాశమనీ వారు పేర్కొంటున్నారు.

దేశీయంగా రూపాయి అడ్డు...: అంతర్జాతీయంగా పసిడి స్వల్పంగా లాభపడినా.. దేశీయంగా రూపాయి బలోపేతం వల్ల (అంతర్జాతీయ మార్కెట్‌లో 38 పైసలు బలపడి 64.07) ఆ ప్రభావం దేశంలో కనపడలేదు. పైగా  మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌– ఎంసీఎక్స్‌లో వారంలో ధర రూ.279 తగ్గి రూ.28,254కు చేరింది. ఇక ముంబై స్పాట్‌ మార్కెట్లో  వారంవారీగా 99.9 స్వచ్ఛత ధర స్వల్పంగా రూ.55 పెరిగి రూ. 28,700 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు