కొనుగోలుకు ఇది తగిన సమయమే!

27 Aug, 2018 01:42 IST|Sakshi

పసిడిపై నిపుణుల అభిప్రాయం

అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్సే్ఛంజ్‌లో ఆరు వారాల నుంచీ పసిడి పడుతూ వస్తోంది. అయితే పసిడి కొనుగోలుకు ఇది తగిన సమయమని విశ్లేషణలు ఉన్నాయి.  ఈ సంవత్సరం ప్రారంభం నుంచీ ఔన్స్‌ (31.1గ్రా) 1,300 డాలర్ల పైన ఉన్న పసిడి, జూన్‌ నుంచి పడిపోతూ వచ్చింది. వారం క్రితం ఏకంగా 1,161 డాలర్లను కూడా చూసింది. అంటే దాదాపు ఏడాది గరిష్టాన్ని చూస్తే, దాదాపు 200 డాలర్లు పడింది.

అమెరికా వృద్ధి అంచనాలు, ఆ దేశ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపు, డాలర్‌ ఇండెక్స్‌ బలోపేతం దీనికి నేపథ్యం. 88.15కు పడిపోయిన డాలర్‌ ఇండెక్స్‌ క్రమంగా బలోపేతమై 95 వద్ద కీలక నిరోధాన్ని దాటి ఏకంగా దాదాపు 97 స్థాయి చూడ్డం ఇక్కడ ప్రస్తావనార్హం. వడ్డీరేట్ల పెంపు ధోరణి మామూలుగానే ఉంటుంది తప్ప, జోరుగా ఏమీ ఉండబోదని అమెరికా ఫెడ్‌ చీఫ్‌ పావెల్‌ చేసిన ప్రకటన,  తాజాగా ముగిసిన వారంలో డాలర్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. డాలర్‌ తాజా గరిష్ట స్థాయి నుంచి పతనమైంది.

దీనితో పుత్తడి మళ్లీ పైకి ఎగసి శుక్రవారంతో ముగిసిన వారంలో 1,212 డాలర్ల వద్దకు చేరింది. వారంలో 19 డాలర్లు ఎగసింది. సమీపకాలంలో పసిడి కొంత ర్యాలీ ఖాయమన్నది నిపుణుల భావన. 1,200 డాలర్ల స్థాయి ‘స్వీట్‌ స్టేజ్‌’ అని పలువురు విశ్లేషిస్తున్నారు. ఒక దేశీయంగా చూస్తే, పసిడి ధర తగ్గినా, రూపాయి బలహీనపడుతున్న ధోరణి భారత్‌లో బంగారం మరింత తగ్గడానికి అడ్డంకిగా ఉండడం గమనార్హం.   

మరిన్ని వార్తలు