ఇక సినిమా చూడటం కొంచెం కష్టమే ..

20 May, 2017 12:08 IST|Sakshi
థియేటర్లలో సినిమా చూడటం ఇక కష్టమే!
ముంబై : సినిమా టిక్కెట్లపై జీఎస్టీ రేటు షాకిచ్చింది. అఫార్డబుల్ రేట్లతో థియేటర్లలో అందరూ సినిమా చూడటానికి వీలుగా తక్కువ రేట్లను నిర్ణయిస్తారనుకున్న  మల్టిఫ్లెక్స్ ఆపరేటర్లను జీఎస్టీ కౌన్సిల్ నిరాశపరిచింది.  ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ మూవీటిక్కెట్లపై ఫిక్స్డ్ రేటును 28 శాతంగా నిర్ణయించింది. జీఎస్టీ శ్లాబులో ఉన్న అత్యధిక రేటు ఇదే. దీంతో ఇక  సినిమా హాల్స్ లో సినిమా చూడటం కష్టమేనని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా హాల్స్ 15 శాతం సర్వీసు పన్ను చెల్లిస్తున్నాయని, దాంతో పాటు ఎంటర్ టైన్మెంట్ ట్యాక్స్ ను కలిపి చెల్లి‍స్తున్నాయని జైట్లీ తెలిపారు. ఇవన్నీ కలిపి ప్రస్తుతం 28 శాతం పన్ను పరిధిలోకి తెచ్చినట్టు పేర్కొన్నారు.
 
పైగా కూల్ డ్రింక్స్, చిరుతిళ్ల ధరలు కూడా పెరుగుతుండటం వల్ల సినిమా చూడటం కొంచెం కష్టమే అవుతుందని తెలుస్తోంది. అయితే 28 శాతం పన్ను అనేది సరియైనది కాదని మల్టిఫ్లెక్స్ ఆపరేటర్లు వాపోతున్నారు. తక్కువ శ్లాబ్ రేట్లకోసం సినిమా ఇండస్ట్రి వర్గాలు పలుమార్లు జీఎస్టీ కౌన్సిల్ తో లాబీయింగ్ చేపట్టారు కూడా. సినిమాను 5 శాతం నుంచి 12 శాతం పరిధిలోకి తీసుకురావాలని అభ్యర్థించారు. అయినా కూడా ప్రస్తుతం సినిమా రేట్లకు పై స్థాయి రేట్లనే నిర్ణయించింది. ఈ నిర్ణయంతో టిక్కెట్లపై సగటున పన్ను రేట్లు 8-10 శాతం పెరుగుతాయి. దీంతో సినిమా ఇండస్ట్రిపై నెగిటివ్ ప్రభావం చూపుతుందని మీడియా ఎంటర్ టైన్మెంట్, ట్యాక్స్ పార్టనర్ ఉక్తర్ష్ సంగ్వి చెప్పారు. అయితే 250 రూపాయల కంటే తక్కువగా వసూలు చేసే సినిమా టాక్కెట్లను పన్ను పరిధి నుంచి మినహాయింపు  ఇచ్చారు. 
>
మరిన్ని వార్తలు