Ramajogayya Sastry: అది కుక్కల చేతుల్లోకి వెళ్తోంది.. వారు విషం చిమ్ముతున్నారు..

14 Dec, 2023 19:34 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ సినిమా అంటే అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. పోస్టర్‌, లుక్స్‌, పాటలు, డైలాగులు.. ఇలా ప్రతీది అద్భుతహ అనిపించేలా ఉండాలని ఆశిస్తుంటారు అభిమానులు. ఏమాత్రం తేడా కొట్టినా సోషల్‌ మీడియాలో విమర్శలతో విరుచుకుపడుతారు. ఇప్పుడదే జరిగింది. మహేశ్‌ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా నుంచి బుధవారం ఓ మై బేబీ లిరికల్‌ సాంగ్‌ విడుదలైంది.

ఓ మై బేబీ సాంగ్‌పై ట్రోలింగ్‌..
'నా కాఫీ కప్పులో షుగర్‌ క్యూబు నువ్వే నువ్వే.. నా కంటి రెప్పలో కాటుక ముగ్గు నువ్వే నువ్వే..' అంటూ ఈ పాట మొదలైంది. అయితే చాలామంది ఈ పాట ట్యూన్‌, లిరిక్స్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాట బాగోలేదని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు హద్దులు మీరుతూ దూషిస్తూ మాట్లాడారు. దీంతో ఓపిక నశించిన గేయరచయిత రామజోగయ్య శాస్త్రి ఈ ట్రోలింగ్‌పై స్పందించాడు.

విషం చిమ్ముతున్నారు
'సోషల్‌ మీడియా కుక్కల చేతిలోకి వెళ్తోంది. ఒక విషయం గురించి తలాతోకా ఏదీ తెలియని వాళ్లు కూడా నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. ఇతరులను జడ్జ్‌ చేస్తున్నారు. కావాలని విషాన్ని చిమ్ముతున్నారు. సినిమా కోసం కష్టపడి పనిచేస్తున్నవారిని టార్గెట్‌ చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఎవరో ఒకరు మాట్లాడాలి. వీళ్లు గీతలు దాటుతున్నారు' అని ఎక్స్‌ (ట్విటర్‌)లో రాసుకొచ్చాడు.

ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడండి..
'ప్రతివాడు మాట్లాడేవాడే.. రాయి విసిరేవాడే.. అభిప్రాయం చెప్పేదానికి ఒక పద్ధతి ఉంటుంది. పాట నిడివి తప్ప నిన్నటి పాటకు ఏం తక్కువైందని? మీ కన్నా ఎక్కువ ప్రేమే మాక్కూడా.. అదే లేకపోతే, ప్రేమించకపోతే మా పని మేం గొప్పగా చేయలేం. అది తెలుసుకుని ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడండి. సక్రమంగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. పద్ధతి మీరకండి' అని మరో ట్వీట్‌లో హెచ్చరించాడు.

చదవండి: ఆగిపోయిన లైవ్‌, రేపటితో ఓటింగ్‌కు శుభంకార్డు

>
మరిన్ని వార్తలు