బెంగళూరు ఎయిర్‌పోర్టుకు జీవీకే గుడ్‌బై

3 Jun, 2017 00:41 IST|Sakshi
బెంగళూరు ఎయిర్‌పోర్టుకు జీవీకే గుడ్‌బై

మిగిలిన 10 శాతం వాటా విక్రయం 
ఫెయిర్‌ఫ్యాక్స్‌ వాటా 48 శాతానికి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మౌలిక రంగ సంస్థ జీవీకే పవర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌.. బెంగళూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ (బీఐఏఎల్‌) నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. బీఐఏఎల్‌లో జీవీకే వద్ద మిగిలిన 10 శాతం వాటాను ఫెయిర్‌ఫ్యాక్స్‌ ఇండియా హోల్డింగ్స్‌ కార్పొరేషన్‌కు రూ.1,290 కోట్లకు విక్రయించనున్నట్టు తెలిపింది. 2017 జూలై ప్రారంభంలో ఈ లావాదేవీ పూర్తి అయ్యే అవకాశం ఉందని జీవీకే వెల్లడించింది. డీల్‌ పూర్తి కాగానే కంపెనీ బోర్డు నుంచి కో–చైర్మన్‌ జీవీకే రెడ్డి, ఎండీ సంజయ్‌ రెడ్డి తప్పుకోనున్నట్టు సమాచారం. విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని జీవీకే గ్రూప్‌ రుణ భారం తగ్గించుకోవడానికి ఉపయోగించనుంది.

బీఐఏఎల్‌లో 33% వాటాను ఫెయిర్‌ఫ్యాక్స్‌ ఇండియాకు రూ.2,202 కోట్లకు విక్రయించేందుకు 2016 మార్చిలో జీవీకే ఒప్పందం కుదుర్చుకుంది. 2017 మార్చిలో ఈ డీల్‌ పూర్తి అయింది. అలాగే బీఐఏఎల్‌లో ఫ్లూగఫెన్‌ జూరిచ్‌ ఏజీ నుంచి 5 శాతం వాటాను ఫెయిర్‌ఫ్యాక్స్‌ కైవసం చేసుకుంది కూడా. దీంతో కంపెనీలో ఫెయిర్‌ఫ్యాక్స్‌ వాటా 38 శాతానికి చేరింది. శుక్రవారం నాటి డీల్‌తో ఈ వాటా కాస్తా 48 శాతానికి ఎగసింది.

ఎయిర్‌పోర్ట్స్‌ రంగంపైనే..: బెంగళూరు ప్రాజెక్టు నుంచి తప్పుకున్నప్పటికీ, ఎయిర్‌పోర్ట్స్‌ రంగం తమ సంస్థకు కీలకమని జీవీకే చైర్మన్‌ జీవీకే రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. తదుపరి దృష్టి ముంబై, నవీ ముంబై ఎయిర్‌పోర్టులపై ఉంటుందని చెప్పారు. ఈ రంగంలో ప్రైవేటీకరణ అవకాశాలపై ఫోకస్‌ చేస్తామన్నారు. కాగా, 2009 నవంబర్‌లో బీఐఏఎల్‌లో 12 శాతం వాటాను జూరిచ్‌ ఎయిర్‌పోర్టు నుంచి జీవీకే దక్కించుకుంది. అలాగే లార్సెన్‌ అండ్‌ టూబ్రో నుంచి 17 శాతం కొనుగోలు చేసింది. సీమెన్స్‌ ప్రాజెక్ట్‌ వెంచర్స్‌ నుంచి కైవసం చేసుకున్న వాటాతో బీఐఏఎల్‌లో జీవీకే వాటా 43 శాతానికి చేరింది. ప్రస్తుతం బీఐఏఎల్‌లో అతి పెద్ద వాటాదారుగా ఫెయిర్‌ఫ్యాక్స్‌ నిలిచింది. బీఎస్‌ఈలో శుక్రవారం జీవీకే ఇన్‌ఫ్రా షేరు ధర 14.45% పెరిగి రూ.5.94 వద్ద క్లోజయ్యింది.

మరిన్ని వార్తలు