ఆ సొమ్మును డిపాజిట్‌ చేయండి!

8 Mar, 2019 05:30 IST|Sakshi

మహికో కేసులో నూజివీడు సీడ్స్‌కు బోంబే హైకోర్టు ఆదేశం

రూ.138 కోట్ల నగదు లేదా బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని ఉత్తర్వులు  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మహికో మోన్‌శాంటో బయోటెక్‌ (ఎంఎంబీఎల్‌) కంపెనీ టెక్నాలజీ సమర్థమైనది కాదు కనక దానికి రాయల్టీ చెల్లించాల్సిన పనిలేదంటూ నిలిపేసిన రూ.138 కోట్లను తమ వద్ద డిపాజిట్‌ చేయాలని హైదరాబాద్‌కు చెందిన విత్తన కంపెనీ నూజివీడు సీడ్స్‌ను బొంబాయి హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని తమవద్ద నగదు లేదా బ్యాంకు గ్యారంటీ రూపంలో డిపాజిట్‌ చేయాలని తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. సబ్‌ లైసెన్స్‌ అగ్రిమెంట్‌ కింద పత్తి విత్తన కంపెనీలకు ఎంఎంబీఎల్‌ బీటీ టెక్నాలజీని విక్రయిస్తున్న విషయం తెలిసిందే.

2015లో నూజివీడు సీడ్స్‌తో సహా పలు విత్తన కంపెనీలు ఎంఎంబీఎస్‌ బీటీ టెక్నాలజీ అసమర్థమైందని.. అందుకే రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని వాదించి రుసుము చెల్లింపులను నిలిపేశాయి. తరవాత మిగిలిన కంపెనీలు వివాదాన్ని పరిష్కరించుకున్నా... ఎన్‌ఎస్‌ఎల్‌ మాత్రం ఈ మొత్తాన్ని చెల్లించలేదు.  గతేడాది దీనిపై ఆర్బిట్రేషన్‌కు వెళ్లగా రూ.117 కోట్లు చెల్లించాలని ట్రైబ్యునల్‌ ఎన్‌ఎస్‌ఎల్‌కు స్పష్టంచేసింది. ఎన్‌ఎస్‌ఎల్‌ చెల్లించకపోవటంతో మహికో సంస్థ దీనిపై ముంబై హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులపై అప్పీలు చేసే అవకాశముంది కనక తాము అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నట్లు నూజివీడు సీడ్స్‌ తెలియజేసింది.   

మరిన్ని వార్తలు