హెచ్‌సీఎల్ టెక్ లాభం 3% డౌన్

20 Oct, 2015 02:08 IST|Sakshi
హెచ్‌సీఎల్ టెక్ లాభం 3% డౌన్

న్యూఢిల్లీ: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 3 శాతం తగ్గింది. నికర లాభం తగ్గినా, రానున్న క్వార్టర్లలో మంచి పనితీరు సాధించగలమన్న ధీమాను హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యక్తం చేసింది.  గత క్యూ2లో రూ.1,873 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,823 కోట్లకు తగ్గిందని  కంపెనీ సీఎఫ్‌ఓ అనిల్ చనన చెప్పారు. ఆదాయం(కన్సాలిడేటెడ్) రూ.8,735 కోట్ల నుంచి 16 శాతం వృద్ధితో రూ.10,097 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.

డాలర్ ప్రాతిపదికన నికర లాభం 31 కోట్ల డాలర్ల నుంచి 9 శాతం క్షీణించి 28 కోట్ల డాలర్లకు పడిపోయిందని తెలిపారు. ఆదాయం మాత్రం 143 కోట్ల డాలర్ల నుంచి 8 శాతం వృద్ధితో 154 కోట్లకు పెరిగిందని తెలిపారు.
 
గత కొన్ని క్వార్టర్లలో ప్రపంచ వ్యాప్తంగా డెవలప్‌మెంట్ సెంటర్లు, కొలాబరేషన్ సెంటర్ల ఏర్పాటు కోసం పెట్టుబడులు పెట్టడం, ప్రతిభ గల సీనియర్ ఉద్యోగులను తీసుకోవడం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ వంటి కొత్త టెక్నాలజీలపై పెట్టుబడుల కారణంగా నికర లాభం తగ్గిందని,  వీటి కోసం గత కొన్ని క్వార్టర్లలో రూ.1,300 కోట్లు ఇన్వెస్ట్ చేశామని అనిల్ చెప్పారు. బియాండిజిటల్, నెక్స్‌ట్-జెన్ ఐటీఓ, ఐఓటీలపై ఇన్వెస్ట్‌మెంట్స్ రానున్న క్వార్టర్లలో మంచి ఫలితాలనివ్వనున్నాయని వివరించారు.

యూరప్‌లో మంచి డీల్స్ సాధించామని, ఈ ఫలితాలు ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో కనిపిస్తాయని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఈఓ అనంత్ గుప్తా చెప్పారు. ఈ క్యూ2లో కంపెనీ 536 మంది ఉద్యోగులను తొల గించింది. దీంతో సిబ్బంది సంఖ్య 1,05,571కు తగ్గింది.  ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.777 కోట్ల వరకూ ఉన్నాయి.
 
బెంగళూరు కంపెనీ కొనుగోలు
బెంగళూరుకు చెందిన కాన్సెప్ట్ టు సిలికాన్ సిస్టమ్స్ ఇంజినీరింగ్ సర్వీసెస్ సంస్థను కొనుగోలు చేశామని, ఫలితంగా సెమి కండక్టర్, ఇండస్ట్రియల్ ఐఓటీ ఇండస్ట్రీలో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేయడానికి  ఈ కొనుగోలు తోడ్పడుతుందని కంపెనీ తెలిపింది. డీల్ విలువ కోటి డాలర్ల కంటే తక్కువగానే ఉందని పేర్కొంది.
ఫలితాల నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ 1.23 శాతం వృద్ధితో రూ.852కు పెరిగింది.

మరిన్ని వార్తలు