ఫేస్‌బుక్ ఆఫీస్ ధ్వంసం

20 Oct, 2015 08:05 IST|Sakshi
ఫేస్‌బుక్ ఆఫీస్ ధ్వంసం

ఇజ్రాయెల్‌లో దుండగుల దాడి
 
జెరూసలెం: ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లోని ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ కార్యాలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. యూదులు, ఇజ్రాయెలీలను చంపాలంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన పేజీలను తొలగించాలన్న డిమాండ్లను పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ దాడికి పాల్పడినట్టు సమాచారం. ఇజ్రాయెల్ పౌరుడు రోటెమ్ గెజ్ తన శరీరంపై ‘‘బ్లడ్ ఆన్ యువర్ హ్యాండ్స్’’ అనే నినాదాన్ని రాసుకుని ఫేస్‌బుక్ ఆఫీసు వద్ద కనిపించినట్టు జెరూసలెం పోస్ట్ పత్రిక ఆదివారం పేర్కొంది.   2011లో రోటెమ్ తన పేరును అధికారికంగా ‘‘మార్క్ జుకర్‌బర్గ్’’ అని మార్చుకున్నాడు.

అయితే తమ సంస్థ వ్యవస్థాపకుని పేరును వేరే వ్యక్తి పెట్టుకోవడంపై ఫేస్‌బుక్ రోటెమ్‌పై కేసు పెట్టింది. మరోవైపు ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలో బీర్‌షేబా నగరంలో బస్ స్టేషన్‌పై ఆదివారం రాత్రి ఒక దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. బస్ స్టేషన్‌లోకి ప్రవేశించిన అతను తుపాకీతో కాల్పులు జరపడం మొదలుపెట్టాడు. కత్తితో సమీపంలోకి వచ్చిన వారిపైనా దాడి చేశాడు. ఈ ఘటనలో ఓ సైనికుడు మృత్యువాతపడగా.. మరో పది మంది గాయపడ్డారు. దాడికి పాల్పడిన వ్యక్తిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

కాల్పులకు తెగబడిన దుండగుడు అరబ్‌కు చెందిన వ్యక్తిగా భద్రతా దళాలు భావిస్తున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశాల్లో త్వరలో పర్యటించి ఇరు దేశాల నేతలతో సమావేశం కానున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీ తెలిపారు.

మరిన్ని వార్తలు