హెచ్‌పీ కొత్త ఉత్పత్తుల హోరు : 4 విభాగాల్లో 6 డివైజ్‌లు విడుదల

18 Jul, 2013 05:34 IST|Sakshi
హెచ్‌పీ కొత్త ఉత్పత్తుల హోరు : 4 విభాగాల్లో 6 డివైజ్‌లు విడుదల

న్యూఢిల్లీ: హ్యులెట్-ప్యాకార్డ్ కంపెనీ బుధవారం నాలుగు కేటగిరీల్లో ఆరు టచ్ డివైస్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆఫీసులో గానీ, ఇంట్లో గానీ, లేదా ప్రయాణంలో ఉన్నప్పుడు ఇలా ఎక్కడ ఉన్నా, ఏ సమయంలోనైనా కంటెంట్ తయారు చేయడం లేదా యాక్సెస్ చేయడానికి వీలున్న ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోందని హెచ్‌పీ ఇండియా కన్సూమర్ ప్రొడక్ట్ కేటగిరీ పీపీఎస్ డెరైక్టర్ కేతన్ పటేల్ చెప్పారు. ఇలాంటి అవసరాలను తీర్చే టచ్ ఎనేబుల్డ్ నోట్‌బుక్, టూ ఇన్ వన్‌లు, అల్ట్రా బుక్, ఆల్ ఇన్ వన్ పీసీలను బుధవారం లాంఛనంగా మార్కెట్లోకి విడుదల చేశామని వివరించారు. ఈ నెలాఖరు నుంచి వీటి విక్రయాలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

నోటుబుక్, ట్యాబ్లెట్‌గా
టూ-ఇన్-వన్ కేటగిరీలో తామందిస్తున్న హెచ్‌పీ స్లేట్ బుక్ బై 2, హెచ్‌పీ స్ల్పిట్ బై2 లను నోట్‌బుక్‌గానూ, ట్యాబ్లెట్‌గానూ ఉపయోగించుకోవచ్చని పటేల్ పేర్కొన్నారు. స్క్రీన్ ఉన్నప్పుడు నోట్‌బుక్‌గానూ, స్క్రీన్‌ను తొలగించి ట్యాబ్లెట్‌గానూ ఈ టూ ఇన్ వన్‌లను ఉపయోగించుకోవచ్చని వివరించారు. స్లేట్‌బుక్ బై2 ఆండ్రాయిడ్ జెల్లీ బీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుందని, ధర రూ.39,900 అని, విండోస్ 8 ఓఎస్‌పై పనిచేసే స్ల్పిట్ బై 2 ధర రూ.64,990 అని తెలిపారు. ఈ రెండింటిలోనూ టచ్ ఫీచర్లున్నాయని చెప్పారు.

కంపెనీ తొలి ఆల్-ఇన్-వన్ పీసీ
ఆల్-ఇన్-వన్ పీసీ సెగ్మెంట్‌లో హెచ్‌పీ ఎన్వి రోవ్ 20ని అందిస్తున్నామని పేర్కొన్నారు. తమ కంపెనీ తొలి మొబైల్ ఆల్-ఇన్-వన్ పీసీ ఇదని వివరించారు. దీని ధర రూ.69,990గా నిర్ణయించామని వివరించారు. దీంట్లో 10- పాయింట్ టచ్ ఎనేబుల్డ్ 20 అంగుళాల ఐపీఎస్ వైడ్ స్క్రీన్, ఎల్‌ఈడీ బ్యాక్‌లిట్ డిస్‌ప్లే, ఫోర్త్ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్లు, ఇంటెల్

హెచ్‌డీ గ్రాఫిక్స్ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. మరో ఆల్-ఇన్-వన్
పీసీ, హెచ్‌పీ స్లేట్ 21 ధర రూ. 24,990 అని, దీంట్లో ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఓఎస్, టెగ్రా 4 క్వాడ్-కోర్ ఎన్‌విడియా ప్రాసెసర్, జూమ్ సౌకర్యం ఉన్న ఆప్టికల్ టచ్ స్క్రీన్ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. ఎక్కడికైనా సులభంగా తీసుకువెళ్లడానికి వీలయ్యేలా హెచ్‌పీ పెవిలియన్ 11 టచ్ స్మార్ట్ నోట్‌బుక్‌ను అందిస్తున్నామని చెప్పారు. 11.6 అంగుళాల డయాగ్నల్ కెపాసిటివ్ టచ్‌స్క్రీన్ ఉన్న ఈ నోట్‌బుక్ ధర రూ.31,990 అని వివరించారు. ఇక గేమింగ్ ప్రధానంగా రూపొందించిన హెచ్‌పీ ఎన్వి టచ్ స్మార్ట్ 14 అల్ట్రాబుక్ ధర రూ.64,990 అని పేర్కొన్నారు. దీంట్లో ఎన్‌విడియా గ్రాఫిక్స్, 2జీబీ వీడియో మెమరీ వంటి ప్రత్యేకతలున్నాయని తెలిపారు.

>
మరిన్ని వార్తలు