గృహ రుణ వడ్డీ రేట్లు ఎక్కువే!

31 Mar, 2017 02:24 IST|Sakshi
గృహ రుణ వడ్డీ రేట్లు ఎక్కువే!

అధిక ధరలు, వడ్డీలే గృహ కొనుగోళ్లకు అడ్డంకి
అందుబాటు ఇళ్లకు డిమాండ్‌ పెరుగుతోంది...
ఐఎంజీసీ నివేదిక వెల్లడి  


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో గృహ రుణాల వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయని అందుకే రుణంతో సొంతిల్లు కొనుగోలు చేయటానికి కస్టమర్లు అయిష్టత వ్యక్తం చేస్తున్నారని ఇండియా మార్ట్‌గేజ్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ (ఐఎంజీసీ) నివేదిక వెల్లడించింది. అధిక స్థిరాస్తి ధరలు, రుణ వడ్డీలే ఈ రంగానికి ప్రతిబంధకాలుగా తయారయ్యాయని వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న వారీలో 38 శాతం మంది దేశంలో వడ్డీ రేట్లు అధికంగా ఉన్నాయని, 32 శాతం స్థిరాస్తుల ధరలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. మరో 30 శాతం మంది తగ్గినంత రుణ లభ్యత లేదని వెల్లడించారని ఐఎంజీసీ సీఈఓ అమితావా మెహ్రా తెలిపారు.

 వ్యక్తిగత పొదుపు ద్వారా తొలిసారి కొనుగోలు చేసిన ఇళ్లు కూడా ఆలస్యమవుతున్నట్లు సర్వేలో పాల్గొన్న పలువురు వ్యాఖ్యానించారు. దేశంలో 46 శాతం మిల్లినియల్స్‌ పేరెంట్స్‌తో, 31 శాతం అద్దె గృహాల్లో, 32 శాతం సొంతిళ్లలో నివాసముంటున్నారని తెలియజేశారు. ఈ సర్వేను మెట్రోలు, పట్టణాల్లో 4,100 మందిపై రెండు దశల్లో నిర్వహించారు. 25–34, 35–44, 45–55 ఏళ్ల వయస్సు వారు సర్వేలో పాల్గొన్నారు.

అందుబాటు గృహాలకు డిమాండ్‌..
దేశంలో అందుబాటు గృహాలకు (అఫర్డబుల్‌ హౌజింగ్‌కు) డిమాండ్‌ పెరుగుతోంది. హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌–2022, రుణ రాయితీలు, ప్రోత్సాహకాలే  ఈ డిమాండ్‌కు కారణమని నివేదిక తెలిపింది. ఇందులోనూ 500 చ.అ.లోపు విస్తీర్ణం గల చిన్న సైజు గృహాలకు డిమాండ్‌ ఉందని.. అందుకే ఈ విభాగంలో ఇప్పటికే దేశంలో పలు ప్రైవేట్‌ నిర్మాణ సంస్థలు అందుబాటు గృహాల ప్రాజెక్ట్‌లను ప్రారంభించాయని వెల్లడించింది.

 పెద్ద నోట్ల రద్దుతో స్థిరాస్తి రంగంలో ప్రత్యామ్నాయా నగదు లావాదేవీలు, నిల్వలు తగ్గిపోవటంతో స్థిరాస్తి ధరలు తగ్గుముఖం పట్టాయని, ఇది సొంతింటి కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నదని నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ ఎండీ అండ్‌ సీఈఓ శ్రీరాం కల్యాణరామన్‌ చెప్పారు. రోజురోజుకూ రూ.15–20 లక్షల్లోపు గృహాల కొనుగోళ్లకు డిమాండ్‌ పెరుగుతోందన్నారు.

మరిన్ని వార్తలు