ఐఎండీ ర్యాంకింగ్‌లో భారత్‌ 3 స్థానాలు పైకి..

21 Nov, 2017 23:50 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ గ్లోబల్‌ బిజినెస్‌ స్కూల్‌ ‘ఐఎండీ’ వరల్డ్‌ టాలెంట్‌ ర్యాంకింగ్‌లో భారత్‌ మూడు స్థానాలు మెరుగుపరచుకుంది. నైపుణ్యం కలిగిన వారిని నియమించుకోవడం, విదేశీ నిపుణులను ఆకర్షించడం, స్థానిక ప్రతిభను మెరుగుపరచుకోవడం వంటి అంశాల పరంగా చూస్తే అంతర్జాతీయంగా 51వ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఇక స్విట్జర్లాంట్‌ అగ్రస్థానం దక్కించుకుంది. దీని తర్వాతి స్థానంలో డెన్మార్క్, బెల్జియం ఉన్నాయి.

ఆస్ట్రియా, ఫిన్‌లాండ్, నెదర్లాండ్స్, నార్వే, జర్మనీ, స్వీడన్, లక్సెంబర్గ్‌ వంటివి టాప్‌–10లో నిలిచాయి. ‘‘ఐఎండీ ర్యాంకింగ్‌లో యూరప్‌ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇందుకు కారణం అక్కడ అద్భుతమైన విద్యా వ్యవస్థ ఉండటమే. దీని వల్ల ఆ ప్రాంతం స్థానిక ప్రతిభను మెరుగుపరచుకుంటోంది. అదే సమయంలో విదేశీ టాలెంట్‌ను, నైపుణ్యం కలిగిన వారిని ఆకర్షిస్తోంది’’ అని నివేదిక పేర్కొంది. ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్, అప్పీల్, రెడీనెస్‌ వంటి అంశాల్లో భారత్‌ వరుసగా 62, 43, 29 ర్యాంకులను సొంతం చేసుకుందని తెలిపింది.

స్థానికులను నియమించుకోవడంలో, విదేశీ కార్మికులను ఆకర్షించడంలో భారత్‌ మెరుగైన ప్రదర్శన కనబరచలేదని ఐఎండీ చీఫ్‌ ఎకనమిస్ట్‌ అర్టురో బ్రిస్‌ అభిప్రాయపడ్డారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో విద్యపై పెట్టుబడులు చాలా తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. బ్రిక్స్‌ దేశాలను గమనిస్తే.. చైనా 40వ స్థానంలో, రష్యా 43వ స్థానంలో, దక్షిణాప్రికా 48వ స్థానంలో, బ్రెజిల్‌ 52వ స్థానంలో ఉన్నాయి. ఐఎండీ 63 దేశాలకు ర్యాంకింగ్‌ ఇచ్చింది.

మరిన్ని వార్తలు