జయహో జుకర్ బర్గ్..!

2 May, 2016 18:26 IST|Sakshi
జయహో జుకర్ బర్గ్..!

సిలికాన్ వ్యాలీ దిగ్గజాలు యాపిల్, గూగుల్, ట్విట్టర్ ఒక దాని తర్వాత ఒకటి ఈ త్రైమాసికంలో నష్టాలను చవిచూడగా.. సోషల్ మీడియా కింగ్ ఫేస్ బుక్ మాత్రం ఈ ఫలితాలను కొల్లగొట్టింది. మార్క్ జుకర్ బర్గ్ దూకుడును ఎవరూ ఆపలేరన్న రీతిలో గత వారం ప్రకటించిన ఫలితాల్లో ఫేస్ బుక్ దూసుకెళ్లింది. ఆదాయాల్లో అదుర్స్ అనిపించింది. సాధారణంగా టెక్నాలజీ స్టార్టప్ కంపెనీలు సముద్రపు అలల్లా యూజర్ల మన్ననలు పొంది అమాంతం పైకి ఎగసి, తర్వాత మళ్లీ పడిపోతాయి. కానీ ఫేస్ బుక్ కు ఇలాంటి అనుభవాలే ఎక్కడా ఎదురుకాకుండా... స్థాపించినప్పటి నుంచి విలువ పెంచుకుంటూనే వస్తోంది. హర్వర్డ్ యూనివర్సిటీలో క్యాంపస్ స్నేహితుల మధ్య కమ్యూనికేషన్ కోసం రూపొందిన ఈ సోషల్ మీడియా సైట్‌ను ప్రస్తుతం నెలకు 165 కోట్ల మంది చూస్తున్నారు. ఈ జనాభా ప్రస్తుత ఇంటర్ నెట్ యూజర్లలో సగం మందికి పైమాటే. గత మూడు నెలల్లో దాదాపు 63 మిలియన్ ప్రజలు ఫేస్ బుక్‌లోకి కొత్తగా అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. ఫేస్ బుక్ వృద్ధి రేటు కూడా క్రమేపీ పెరుగుతోందని ఆర్ బీసీ విశ్లేషకులు తెలుపుతున్నారు.

ఈ ఫలితాలతో ఫేస్ బుక్ ఇపుడు ఫైనాన్షియల్ పవర్ హోస్ లోకి మారిందట. ఫేస్ బుక్ లాభాలు కూడా ఈ త్రైమాసికంలో ఒక్కసారిగా 150 కోట్ల డాలర్లకు చేరాయి. మొబైల్ ఇంటర్ నెట్ లో ఓ ప్రబలమైన శక్తిగా ఇది రూపాంతరం చెందింది. అదేవిధంగా ఐఫోన్ స్టోర్ కలిగి ఉన్న టాప్-6 యాప్ లో కూడా నాలుగు యాప్ లు ఫేస్ బుక్ కు చెందినవే కావడం విశేషం. తమ యూజర్లు రోజులో దాదాపు 50 నిమిషాలు ఫేస్ బుక్ పైనే సమయాన్ని గడుపుతున్నారని ఫేస్ బుక్ తన ఫలితాల సమయంలో ప్రకటించింది. ప్రజలు ఎక్కువగా వాడుతున్న వాట్సాప్ యాప్ ను లెక్కలోకి తీసుకోకుండానే ఫేస్ బుక్ ఈ విషయాన్ని తెలిపింది. ఒకవేళ వాట్సాప్ ను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఫేస్ బుక్ కు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో ఊహించలేనిది.

కానీ కొన్ని సమయాల్లో ఫేస్ బుక్ కు చిక్కులు ఎదురయ్యాయి. ఇన్‌స్ట్రాగ్రాం యాప్ ను స్మార్ట్ ఫోన్లలోకి కొత్తగా తీసుకొచ్చేటప్పుడు, అలాగే వాట్సాప్ ను కొనుగోలు చేసేటప్పుడు ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఇబ్బందులన్నింటినీ తట్టుకుంటూ ఓ పవర్ ఫుల్ టెక్నాలజీ సంస్థగా పేస్ బుక్ ఎదిగింది. కొత్త టెక్నాలజీని ఒడిసి పట్టుకుంటూ తన స్థానాన్ని బలపర్చుకుంటోంది. వీటన్నింటికీ ఫేస్ బుక్ కు వ్యవస్థాపకుడు, సీఈవోగా ఉంటున్న జుకర్ బర్గ్ కీలక పాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్భుతమైన ఫలితాలతో పెట్టుబడిదారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. పెట్టుబడిదారుల ఓటింగ్ పవర్ అంతా 31 ఏళ్ల జుకర్ బర్గ్ ఆధీనంలో ఉండాలని ఫేస్ బుక్ గత వారం ఫలితాల్లో ప్రతిపాదించింది కూడా. గూగుల్, యాపిల్ వంటి వాటిని వెనక్కి నెట్టేస్తున్న ఫేస్ బుక్ కొత్త టెక్నాలజీ ప్లాట్ ఫాం వార్‌లో దూసుకెళ్తోంది.

మరిన్ని వార్తలు