‘జీరో’ ఖాతాల్లో భారీ డిపాజిట్లు

7 Oct, 2017 00:49 IST|Sakshi

5,800 షెల్‌ కంపెనీల ఖాతాల్లో భారీ లావాదేవీలు

పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ.4,574 కోట్లు జమ

ఆ తర్వాత ఖాతాలన్నీ ఖాళీ

కేంద్రానికి బ్యాంకుల సమాచారం  

న్యూఢిల్లీ: నల్లధన చలామణికి వీలు కల్పించాయని భావిస్తున్న షెల్‌ కంపెనీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి కీలక సమాచారం అందింది. 5.800 షెల్‌ కంపెనీల జీరో బ్యాలన్స్‌ ఖాతాల్లో పెద్ద నోట్ల రద్దు తర్వాత భారీగా రూ.4,574 కోట్ల వరకూ నగదు జమయిందని, ఆ తరవాత అందులో రూ.4.552 కోట్ల మేర విత్‌డ్రా చేసుకోవడం కూడా జరిగిపోయిందని సమాచారం అందింది.

2,09,032 అనుమానిత కంపెనీలకు సంబంధించి లావాదేవీలు, పెద్ద నోట్ల రద్దు తర్వాత వాటి ఖాతాల్లో నగదు జమలపై 13 బ్యాంకులు కీలకమైన సమాచారాన్ని అందించాయని కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా తెలిపింది. ఈ కంపెనీలన్నీ కూడా ఈ ఏడాది ఆరంభంలో కంపెనీల రిజిస్ట్రార్‌ గుర్తింపును కోల్పోయినవే. ఈ తరహా కంపెనీల బ్యాంకు లావాదేవీలపై గత నెలలో కేంద్రం ఆంక్షలు కూడా విధించింది. 

కాగా, బ్యాంకులు అందించిన సమాచారం ప్రకారం... ఓ కంపెనీ అయితే ఏకంగా 2,134 ఖాతాలను కలిగి ఉండడం గమనార్హం. కొన్ని కంపెనీలకు 900 ఖాతాలు, కొన్నిటికి 300 ఖాతాలు కూడా ఉన్నాయి. గతేడాది పెద్ద నోట్ల రద్దు నాటికి (2016 నవంబర్‌ 8) ఈ కంపెనీల ఖాతాల్లో (రుణ ఖాతాల మినహా) రూ.22.05 కోట్ల బ్యాలన్స్‌ ఉంది.

నవంబర్‌ 9న డీమోనిటైజేషన్‌ ప్రకటన తర్వాత నుంచి ఈ కంపెనీల రిజిస్ట్రేషన్లను రద్దు చేసే నాటికి వీటి ఖాతాల్లో రూ.4,573.87 కోట్ల మేర నగదు డిపాజిట్లు అయింది. ఇందులో రూ.4,552 కోట్లను విత్‌ డ్రా చేసుకున్నారు’’ అని కేంద్రం తన ప్రకటనలో వివరించింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు