భారీగా కుప్పకూలిన ఐడియా

28 Apr, 2018 15:41 IST|Sakshi

న్యూఢిల్లీ : ఆదిత్య బిర్లాకు చెందిన ఐడియా సెల్యులార్‌ కంపెనీ మరోసారి భారీగా కుప్పకూలింది. కంపెనీ కన్సాలిడేట్‌ నికర నష్టాలు మూడింతలు మేర ఎగిశాయి. నేడు ప్రకటించిన మార్చి క్వార్టర్‌ ఫలితాల్లో కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర నష్టాలు రూ.962.20 కోట్లగా ఉన్నట్టు ప్రకటించింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో కంపెనీ నికర నష్టాలు రూ.327.70 కోట్లగా ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది కంటే ఈ ఏడాది ఐడియాకు నష్టాలు మరింతగా పెరిగాయి. క్వార్టర్‌ సమీక్షలో కంపెనీ మొత్తం ఆదాయం ఏడాది ఏడాదికి 22 శాతం తగ్గి రూ.6387.70 కోట్లగా రికార్డైంది. గతేడాది ఇది రూ.8,194.50 కోట్లగా ఉంది. ఏడాది వ్యాప్తంగా కంపెనీ నష్టాలు రూ.4168.20 కోట్లగా ఉన్నట్టు ఐడియా ప్రకటించింది. 

ఐడియా ఆర్పూ(యావరేజ్‌ రెవెన్యూ ఫర్‌ యూజర్‌) కూడా 114 రూపాయల నుంచి 105 రూపాయలకు తగ్గింది. ఇతర టెలికాం కంపెనీల ఆర్పూలతో పోలిస్తే ఐడియాదే తక్కువ. జియో ఆర్పూ 137 రూపాయలుండగా.. భారతీ ఎయిర్‌టెల్‌ ఆర్పూ 116 రూపాయలుగా ఉంది. ఐడియా సెల్యులార్‌ ఇలా నష్టాలు ప్రకటించడం వరుసగా ఇది ఆరోసారి. దేశీయంగా, అంతర్జాతీయంగా ఎంటీసీ సెటిల్‌మెంట్‌ రేటు భారీగా తగ్గడం, ఎక్కువ ఆర్పూ అందించే కన్జ్యూమర్లు, తక్కువ ధర కలిగిన అపరిమిత వాయిస్‌ డేటా ప్లాన్ల వైపు తరలివెళ్లడం ఐడియా స్థూల రెవెన్యూలపై ప్రభావం చూపినట్టు కంపెనీ ప్రకటించింది. కాగ, టెలికాం మార్కెట్‌లో నెలకొన్న తీవ్ర పోటీకర వాతావరణ నేపథ్యంలో ఐడియా, వొడాఫోన్‌లు జత కట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు కంపెనీలు ఈ ఏడాది ప్రథమార్థంలో ఒకటి కాబోతున్నాయి. ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఐడియా కంపెనీ స్టాక్‌ 0.66 శాతం పెరిగి రూ.68.80 వద్ద ముగిసింది.  
 

మరిన్ని వార్తలు