ఐడియా–వొడాఫోన్‌ విలీనం ఆలస్యం!

25 Jun, 2018 02:26 IST|Sakshi

రూ.4,700 కోట్ల స్పెక్ట్రమ్‌ బకాయి చెల్లించాకే

న్యూఢిల్లీ: ఐడియా–వొడాఫోన్‌ విలీనం ముందు అనుకున్నట్టు ఈ నెల 30లోపు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. వొడాఫోన్‌ ఇండియా వన్‌టైమ్‌ స్పెక్ట్రమ్‌ చార్జీల రూపంలో రూ.4,700 కోట్ల మేర బకాయి ఉంది. దీంతో ఐడియాలో విలీనానికి ముందే ఈ బకాయిలను చెల్లించాలని టెలికం శాఖ కోరనుంది. లేదా బ్యాంకు గ్యారంటీలను సమర్పించాలని కోరనున్నట్టు సమాచారం. నిజానికి 2015లో వొడాఫోన్‌ తన సబ్సిడరీలైన వొడాఫోన్‌ ఈస్ట్, వొడాఫోన్‌ సౌత్, వొడాఫోన్‌ సెల్యులర్, వొడాఫోన్‌ డిజిలింక్‌లను వొడాఫోన్‌ మొబైల్‌ సర్వీసెస్‌లో విలీనం చేసింది.

ఇదే ఇప్పుడు వొడాఫోన్‌ ఇండియాగా మారింది. అయితే, విలీనం సమయంలోనే రూ.6,678 కోట్ల వన్‌టైమ్‌ స్పెక్ట్రమ్‌ బకాయిలను చెల్లించాలని టెలికం శాఖ డిమాండ్‌ నోటీసు చేయడంతో వొడాఫోన్‌ కోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వొడాఫోన్‌ రూ.2,000 కోట్ల బకాయిలనే చెల్లించింది. దీంతో బకాయిలపై టెలికం శాఖ న్యాయ సలహా కోరగా, వొడాఫోన్‌ నుంచి బకాయిల చెల్లింపునకు డిమాండ్‌ చేయవచ్చని వచ్చింది. దీంతో వడ్డీ సహా మొత్తం ఎంత బకాయి అన్నది ఖరారు చేసే పనిలో ఉన్నట్టు ఆ అధికారి తెలిపారు. 

మరిన్ని వార్తలు