టెక్స్‌టైల్స్‌ పరిశ్రమకు ప్రోత్సాహకాలు!

6 Aug, 2018 00:16 IST|Sakshi

300 ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు 

దేశీయ తయారీని పెంచే యోచనలో కేంద్రం

న్యూఢిల్లీ: దేశీయ టెక్స్‌టైల్స్‌ పరిశ్రమకు మరింత జీవం పోసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకోనుంది. 300 రకాల వస్త్రోత్పత్తుల దిగుమతులపై సుంకాలు పెంచనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. తద్వారా దేశీయ తయారీకి ప్రోత్సాహాన్నిచ్చి మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా పేర్కొన్నాయి. అలాగే, ఈ రంగానికి సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సైతం సరళీకరించనున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి.

ఇలా దిగుమతి సుంకాలు పెంచే వాటిలో కొన్ని రకాల ఫ్యాబ్రిక్స్, గార్మెంట్స్, మానవ తయారీ ఫైబర్స్‌ ఉన్నట్టు చెప్పాయి. ప్రస్తుతం వీటిపై సుంకాలు 5–10 శాతం స్థాయిలో ఉండగా, 20 శాతానికి పెంచనున్నట్టు తెలిపాయి. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్టు వెల్లడించాయి. ఈ వారంలోనే సుంకాలు పెంచాలని నిర్ణయిస్తే ముందుగా పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. సుంకాలు పెంచడం వల్ల విదేశీ ఉత్పత్తుల కంటే దేశీయ తయారీ ఉత్పత్తుల ధరలు తక్కువగా ఉండేందుకు అవకాశం కలుగుతుంది. 

మరిన్ని వార్తలు