ఫిబ్రవరి 13న ఐటీ, స్టార్టప్ పాలసీ!

19 Jan, 2016 02:05 IST|Sakshi
ఫిబ్రవరి 13న ఐటీ, స్టార్టప్ పాలసీ!

 హైదరాబాద్‌లో నాస్కామ్ 10 కే వేర్‌హౌజ్: కేటీఆర్
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో :దేశంలో ఎప్పుడూ లేని విధంగా స్టార్టప్ కంపెనీల గురించి మాట్లాడుకోవటం చూస్తున్నామని, అది కూడా దేశ ప్రధాని నుంచే మొదలుకావటం శుభపరిణామమని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి కేటీ రామారావు చెప్పారు. స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఎలాగైతే స్టార్టప్ పాలసీని ప్రకటించిందో... దానికి ఏమాత్రం తీసిపోని విధంగా తెలంగాణలోనూ ఐటీ, స్టార్టప్ పాలసీని తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు.

హైదరాబాద్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పాలసీ ఆవిష్కరణను వాయిదా వేశామని, ఎన్నికల అనంతరం ఫిబ్రవరి 13న పాలసీని విడుదల చేస్తామని వెల్లడించారు. సోమవారమిక్కడ టీ-హబ్‌లో ‘నాస్కాం 10కే వేర్‌హౌజ్’ను ప్రారంభించిన సందర్భంగా నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్, చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘అకాడమీ స్థాయి నుంచే యువ పారిశ్రామికవేత్తలను తయారు చేయాలి. అందుకే త్వరలోనే కోర్స్ క్రెడిట్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. పాఠశాల, కళాశాల స్థాయిలోనే పారిశ్రామిక ఆలోచనలను వెలికితీసి సరైన మార్గదర్శనం చేయడానికిది ఉపకరిస్తుంది. టీ- హబ్‌లో మరిన్ని వేర్‌హౌజ్‌ల ప్రారంభానికి ప్రయత్నిస్తున్నాం’’ అన్నారాయన.

 సోషల్ రిలేషన్స్‌లోనే అవకాశాలు: చంద్రశేఖర్
 దేశంలో యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సంప్రదాయ వ్యాపార పద్ధతుల నుంచి టెక్నాలజీ బిజినెస్‌ల వైపు అడుగులేస్తున్నారని నాస్కామ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ చెప్పారు. ‘‘గతంలో ఈ-కామర్స్, లాజిస్టిక్ రంగంలో ఎక్కువగా స్టార్టప్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు సామాజిక సంబంధమైన (సోషల్ రిలేషన్స్) రంగంలో అవకాశాలు ఎక్కువ’’ అన్నారాయన. సోషల్ రిలేషన్స్ అంటే ఎక్కువ మందికి అవసరమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలన్నారు. త్వరలో విశాఖలోనూ నాస్కామ్ వేర్‌హౌజ్‌ను ఆరంభిస్తామన్నారు. దీన్లో స్టార్టప్ కంపెనీలకు ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలుంటాయి. పారిశ్రామికవేత్తలు, నిపుణుల సల హాలు, సూచనలు, శిక్షణ శిబిరాలు, సదస్సులు, మెంటారింగ్‌లు ఉంటాయి.

 ఆచరణతోనే విజయం: మోహన్‌రెడ్డి
 చక్కని ఆలోచనతో స్టార్టప్‌ను తెచ్చినా, దాన్ని ప్రణాళికాబద్ధంగా ఆచరణయోగ్యం చేస్తేనే విజయం దక్కుతుందని నాస్కామ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి చెప్పారు. స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడమంటే మౌలిక సదుపాయాలు సమకూర్చడం కాదని, వాటికి అవసరమైన దిశానిర్దేశం, మెంటారింగ్, ఫండింగ్ సమకూర్చాల్సి ఉంటుందని చెప్పారు. టీ-హబ్ అలాగే మొదలైందన్నారు. ‘‘నేటి యువ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అదృష్టవంతులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ స్టార్టప్‌లను బాగా ప్రోత్సహిస్తున్నాయి. మౌలిక సదుపాయాలే కాదు గ్రాంట్లు, రాయితీలూ అందిస్తున్నాయి. విద్య, వైద్యం, వ్యవసాయం, తయారీ.. ఇలా అన్ని రంగాల్లోనూ సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటిని టెక్నాలజీ ద్వారా నివృత్తి చేసి అవకాశాలను అందిపుచ్చుకోవాలి’’ అన్నారాయన.
 

మరిన్ని వార్తలు