వచ్చే ఏడాది పాలసీల వెల్లువ

31 Oct, 2019 05:27 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బీమా కంపెనీల నుంచి వచ్చే ఏడాది పాలసీలు వెల్లువలా వచ్చిపడతాయని ఇండియా ఫస్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తెలిపింది. ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐఆర్‌డీఏ) చొరవతో వినూత్న పాలసీలు రానున్నాయని ఇండియాఫస్ట్‌ డిప్యూటీ సీఈవో రుషభ్‌ గాంధీ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. పాలసీదారులకు అనుకూలంగా ఉండేలా కంపెనీలు వీటిని రూపొందిస్తున్నాయని చెప్పారు. మూడు పాలసీలకు తాము దరఖాస్తు చేశామన్నారు.

గత ఆర్థిక సంవత్సరం మాదిరిగా 2019–20లో కంపెనీ సుమారు రూ.3,200 కోట్ల వ్యాపారం అంచనా వేస్తోందని తెలిపారు. ఇందులో నూతన వ్యాపారం రూ.1,000 కోట్లు ఆశిస్తున్నట్టు వెల్లడించారు. కాగా, సాండ్‌బాక్స్‌ పేరుతో ఐఆర్‌డీఏ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న పాలసీలకు భిన్నంగా.. కస్టమర్లకు అనుకూలంగా ఉండే పాలసీలను రూపొందించేలా బీమా కంపెనీలను ప్రోత్సహిస్తోంది. సాండ్‌బాక్స్‌ కింద అనుమతి పొందిన బీమా ప్లాన్‌కు తొలుత నియంత్రణ పరంగా కొంత వెసులుబాటు ఉంటుంది. పరిమిత కాలానికి, పరిమిత సంఖ్యలో పాలసీలను కంపెనీలు విక్రయించాల్సి ఉంటుంది. ఫలితాలనుబట్టి అట్టి ప్లాన్‌ను కొనసాగించాలా లేదా అన్నది ఐఆర్‌డీఏ నిర్ణయిస్తుంది.

>
మరిన్ని వార్తలు