కార్పొరేట్ ట్యాక్స్ కోతపై స్పష్టత కావాలి

7 Jan, 2016 01:14 IST|Sakshi
కార్పొరేట్ ట్యాక్స్ కోతపై స్పష్టత కావాలి

ప్రీ-బడ్జెట్ సమావేశాల్లో పరిశ్రమవర్గాల వినతి
 న్యూఢిల్లీ: రాబోయే బడ్జెట్‌లో కార్పొరేట్ ట్యాక్స్ రేటును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించే అంశానికి సంబంధించి స్పష్టమైన ప్రణాళికను ప్రకటించాలని పరిశ్రమవర్గాలు ప్రభుత్వాన్ని కోరాయి. ప్రోత్సాహకాల ఉపసంహరణ అనేది... కార్పొరేట్ ట్యాక్స్ రేటు తగ్గింపుతో పాటు కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) తొలగింపునకు అనుగుణంగా జరగాలని పేర్కొన్నాయి. బడ్జెట్ ముందస్తు సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ సందర్భంగా పరిశ్రమల సమాఖ్యలు సీఐఐ, ఫిక్కీ ఈ మేరకు తమ వినతులు సమర్పించాయి.
 
  ప్రోత్సాహకాలు, మినహాయింపుల ఉపసంహరణ ప్రతిపాదనకు తమ మద్దతు ఉంటుందని సీఐఐ ప్రెసిడెంట్ సుమీత్ మజుందార్ చెప్పారు. వీటిని తగ్గించిన తర్వాత మ్యాట్‌ను దశలవారీగా ఎత్తివేయాలని కోరినట్లు ఫిక్కీ ప్రెసిడెంట్ హర్షవర్ధన్ నోతియా తెలిపారు. ఇక వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్‌టీ) అమలులో ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతుంటుందని వారు పేర్కొన్నారు.
 
 ప్రారంభ దశలోని స్టార్టప్‌లకు పన్నులపరమైన బాదరబందీ ఉండకుండా చూడాలని తాము సూచించినట్లు ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ తెలిపారు. వ్యాపారాలకు అనుకూల పరిస్థితులను కల్పించడంతో పాటు పన్నుల విధానాన్ని కూడా మెరుగుపర్చేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరినట్లు అసోచాం ప్రెసిడెంట్ సునీల్ కనోడియా వివరించారు. ఎగుమతులకు సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయింపునివ్వాలని విజ్ఞప్తి చేసినట్లు ఎఫ్‌ఐఈవో ప్రెసిడెంట్ ఎస్‌సీ రాల్హన్ తెలిపారు.
 

మరిన్ని వార్తలు