భారత్లో ఆ చిప్ దిగ్గజం 3వేల ఉద్యోగాలు

14 Jun, 2017 13:17 IST|Sakshi
భారత్లో ఆ చిప్ దిగ్గజం 3వేల ఉద్యోగాలు
బెంగళూరు : ప్రపంచంలో చిప్ తయారీలో అగ్రగామిగా ఉన్న ఇంటెల్ కార్పొరేషన్ భారత్ లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. బెంగళూరులో కొత్తగా ఏర్పాటుచేస్తున్న రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ లో రూ.1,100 కోట్లను పెట్టుబడులుగా పెడుతున్నట్టు బుధవారం అధికారికంగా ప్రకటించింది.  దీనిలో భాగంగా 3వేలకు పైగా ఉద్యోగాలు సృష్టించనున్నామని పేర్కొంది. వచ్చే 18నెలల్లో ఈ ఉద్యోగాల కల్పించనున్నట్టు చెప్పింది. ఎనిమిది ఎకరాల క్యాంపస్ లో ఈ కొత్త ఆర్ అండ్ డీ సెంటర్ ను ఇంటెల్ ఏర్పాటుచేస్తోంది. కంప్యూటర్ సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్, హార్డ్వేర్ డిజైన్ సర్వీసు సౌకర్యాలను కూడా ఇక్కడ కల్పించనుంది. భారత్ లో తమ వ్యాపారాల విస్తరణలో భాగంగా ఈ పెట్టుబడులు పెడుతున్నట్టు ఇంటెల్ ఇండియా జనరల్ మేనేజర్ నివృతి రాయ్ న్యూస్ కాన్ఫరెన్స్ లో  చెప్పారు. ఈ కాన్ఫరెన్స్ లో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఐటీ మంత్రి ప్రియాంక్ ఖార్గేలు కూడా పాల్గొన్నారు.  
 
ఇంటెల్ 2016 వరకు భారత్ లో పెట్టిన 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ఈ కొత్త పెట్టుబడులు అదనం. కంపెనీ భారత సబ్సిడరీలో దాదాపు 7వేల మంది టెక్కీలు తన గ్లోబల్ కస్టమర్ల కోసం పనిచేస్తున్నట్టు ఇంటెల్ తెలిపింది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, హార్డ్ వేర్ డిజైన్, టెస్టింగ్, కంప్యూటర్ హార్డ్ వేర్ వాలిడేషన్, తర్వాతి తరం డిజిటల్ డివైజ్ లకు సాఫ్ట్ వేర్ ఉత్పత్తులపై కంపెనీ కార్యకలాపాలు ఎక్కువగా దృష్టిసారిస్తున్నాయని ఇంటెల్ చెప్పింది. ఇంటెల్ బెంగళూరులో పెట్టుబోయే పెట్టుబడులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని హై-లెవల్ క్లియరెన్స్ కమిటీ 2016 ఫిబ్రవరి 1నే ఆమోదం తెలిపింది. ఈ సెంటర్ స్థాపన కోసం కర్నాటక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బోర్డు భూమిని కూడా కేటాయించింది.
మరిన్ని వార్తలు