ఎక్కడికైనా క్యాబ్‌ రెడీ!

25 May, 2018 10:39 IST|Sakshi

ఓలా ఇంటర్‌ సిటీ సర్వీసులకు స్పందన

సిటీ నుంచి తెలుగు రాష్ట్రాలకు సర్వీసులు  

రోజూ నగరం నుంచి 10 వేల మందికి పైగా ప్రయాణం

విజయవాడ, తిరుపతి, శ్రీశైలం తదితర ప్రాంతాలకు డిమాండ్‌

ఇంత వరకు సిటీకే పరిమితమైన క్యాబ్‌ సర్వీసులు ఇప్పుడు హైదరాబాద్‌ నుంచి ఎక్కడికైనా సరే పరుగుకు సిద్ధమంటున్నాయి. వీకెండ్‌లో టూర్‌కు వెళుతున్నా.. వారం రోజుల పాటు ఇంటిల్లిపాదీ పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధపడినా సరే ఇప్పుడు క్యాబ్‌ అందుబాటులో ఉంది. బుక్‌ చేసిన గంటలోగా ఇంటికి వచ్చేస్తుంది. సొంత వాహనం అనుభూతితో ప్రయాణం చేయవచ్చు. నగరంలో క్యాబ్‌సేవలు అందిస్తున్న ‘ఓలా’ సంస్థ ఇప్పుడు ‘అవుట్‌ స్టేషన్‌ సర్వీస్‌’లను ప్రవేశపెట్టింది. హైదరాబాద్‌ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాలకు, పర్యాటక ప్రాంతాలకు ఈ క్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత వేసవి రద్దీ దృష్ట్యా ప్రతిరోజు సుమారు 10 వేల మంది ప్రయాణికులు హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు అవుట్‌ స్టేషన్‌ క్యాబ్‌లను ఎంపిక చేసుకుంటున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రయాణికుల అభిరుచికి అనుగుణమైన కార్లను ఇంటర్‌సిటీ సర్వీసులుగా నడుపుతున్నారు.

సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుతం దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా నగరాలు, జిల్లా కేంద్రాలకు క్యాబ్‌ సేవలను అందుబాటులోకి తెచ్చిన  ఓలా.. మరో 600 నగరాలకు వన్‌వే ట్రిప్పులను అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, విశాఖ, తిరుపతి, ఏలూరు, చిత్తూరు, కడప, వరంగల్, శ్రీశైలం తదితర ప్రధాన కేంద్రాలకు వన్‌వే  ట్రిప్పులను, వీకెండ్‌ క్యాబ్‌ సర్వీసులను ప్రవేశపెట్టింది. ఓలా యాప్‌ నుంచే ఈ అవుట్‌ స్టేషన్‌ సర్వీసులను బుక్‌ చేసుకోవచ్చు. ‘అవుట్‌ స్టేషన్‌’ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుంటే అన్ని వివరాలు మొబైల్‌ స్క్రీన్‌పై దర్శనమిస్తాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్లాలనే అంశాన్ని ఎంపిక చేసుకొంటే అందుకు చెల్లించవలసిన చార్జీలు కూడా తెలిసిపోతాయి. చార్జీల్లో పారదర్శకత, బాధ్యతాయుతమైన సేవల నిర్వహణ ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. వన్‌వే ట్రిప్పులతో పాటు, 12 గంటల ట్రిప్పులు  కూడా అందుబాటులో ఉన్నాయి.

క్యాబ్‌ బుక్‌ చేసుకున్న గంట వ్యవధిలోనే క్యాబ్‌ ఇంటికి ముందుకు వచ్చి వాలుతుంది. అంతేకాదు 7 రోజుల ముందే బుక్‌ చేసుకొనే అవకాశం కూడా ఉంది. వెళ్లాల్సిన ప్రయాణికుల సంఖ్య, కావలసిన సదుపాయాలకు అనుగుణంగా సెడాన్, ఎస్‌యూవీ, లగ్జరీ వాహనాలను ఎంపిక చేసుకోవచ్చు. దేని చార్జీలు దానికే విడిగా ఉంటాయి. పూర్తి ఏసీ సదుపాయంతో, వినోదభరితమైన ప్రయాణ సదుపాయాన్ని అందజేస్తారు. వన్‌వే ట్రిప్పులు, వీకెండ్‌ టూర్లు కూడా సిద్ధం చేశారు. అవుట్‌ స్టేషన్‌ సర్వీసులను గత సంవత్సరమే ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టినప్పటికీ.. ప్రస్తుతం అన్ని ప్రధాన నగరాలకు వాటిని విస్తరించడంతో డిమాండ్‌ పెరిగినట్లు ఓలా ప్రతినిధి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు.

ప్రయాణికులకు పూర్తి భద్రత..
ఓలా యాప్‌ నుంచి బుక్‌ చేసుకొనే అవుట్‌ స్టేషన్‌ సర్వీసుల్లో అన్ని భద్రతా సదుపాయాలు ఉన్నాయి. డ్రైవర్‌ అనుభవం, డ్రైవింగ్‌ లైసెన్సు, వాహనం వివరాలతో పాటు ఏ క్షణంలోనైనా రక్షణ కోరేందుకు ప్యానిక్‌ బటన్‌ సైతం ఏర్పాటు చేశారు. జీపీఎస్‌తో అనుసంధానం చేయడం వల్ల అవుట్‌ స్టేషన్‌ క్యాబ్‌ల్లో కూడా వెహికల్‌ ట్రాకింగ్‌ మూవ్‌మెంట్‌ తెలుస్తుంది. 24 గంటలూ భద్రతా సదుపాయం ఉంటుంది. 

మరిన్ని వార్తలు