జెట్‌లో జీతాల సమస్య: క్షమాపణలు చెప్పిన కంపెనీ

15 Oct, 2018 08:58 IST|Sakshi

న్యూఢిల్లీ : నరేష్‌ గోయల్‌కు చెందిన విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. గత రెండు నెలల నుంచి ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకుండా జాప్యం చేస్తూ వస్తోంది. సెప్టెంబర్‌ వేతనాలను కూడా జెట్‌ ఎయిర్‌వేస్‌ ఇంకా తన ఉద్యోగులకు చెల్లించలేదు. సీనియర్‌ మేనేజ్‌మెంట్‌కు, పైలెట్లకు, ఇంజనీర్లకు వేతనాలను ఆలస్యం చేస్తున్నందుకు క్షమాపణలు చెబుతున్నట్టు జెట్‌ ఎయిర్‌వేస్‌ తెలిపింది. క్షమాపణలు ప్రకటించిన మేనేజ్‌మెంట్‌, ఎప్పుడు ఆ వేతనాలను ఇస్తారో మాత్రం వెల్లడించలేదు. ఆగస్టు నెల వేతనాలను ఆలస్యం చేసిన తర్వాత ఈ కంపెనీ, తన మూడు కేటగిరీ స్థాయిలో ఉన్న ఉద్యోగులకు వేతనాలను రెండు విడతలు చెల్లించనున్నట్టు పేర్కొంది. 

ఆగస్టు నెల వేతనాన్ని సెప్టెంబర్‌ 11, 26వ తేదీల్లో చెల్లించనున్నట్టు ప్రకటించింది. దానిలో కూడా రెండో విడతను కూడా మరో రెండు ఇన్‌స్టాల్‌మెంట్స్‌గా చేసింది. సెప్టెంబర్‌ 26, అక్టోబర్‌ 9న చెల్లించనున్నట్టు పేర్కొంది. అదేమాదిరి సెప్టెంబర్‌ నెల వేతనాన్ని అక్టోబర్‌ 11, 26 తేదీల్లో చెల్లించాల్సి ఉంది. కానీ ముందుగా నిర్ణయించిన తుది గడువు ముగిసినప్పటికీ సెప్టెంబర్‌ నెల వేతనాన్ని కంపెనీ ఇంకా అందించలేదు. త్వరలోనే మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన జెట్‌ ఎయిర్‌వేస్‌, చెల్లింపుల తేదీపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

‘వేతనాలు చెల్లించకుండా ఆపుతున్నందుకు ముందుగా మీకు క్షమాపణలు. ఈ విషయంలో మీ సహనాన్ని మెచ్చుకోవాలి. మీరు మీ డ్యూటీలను అంకితభావంతో చేస్తున్నారు. కంపెనీ తరఫున ఉద్యోగులకు కృతజ్ఞతలు’ అని జెట్‌ ఎయిర్‌వేస్‌ చీఫ్‌ పీపుల్‌ ఆఫీసర్‌ రాహుల్‌ తనేజా అన్నారు. అయితే యూనియన్‌లో ఉన్న నాయకులపై జెట్‌ ఎయిర్‌వేస్‌ పైలెట్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వారు వేతనాలు చెల్లించాలని మేనేజ్‌మెంట్‌పై ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదని ఆరోపిస్తున్నారు.  

మరిన్ని వార్తలు