వెయ్యికోట్లకు ముంచేసిన కనిష్క్‌ జ్యువెలరీ

21 Mar, 2018 13:11 IST|Sakshi
కనిష్క్‌ జ్యువెలరీ ఫైల్‌ ఫోటో

సాక్షి,  చెన్నై: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వరుస కుంభకోణాలు  ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తాజాగా అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో  చోటుచేసుకున్న మరో జ్యువెలరీ  వ్యాపారం స్కాం  వార్తల కెక్కింది.  వేలకోట్ల కుంభకోణానికి పాల్పడిన చెన్నైకు చెందిన కనిష్క్‌ గోల్డ్‌ జ్యుయలరీ ప్రమోటర్లు విదేశాలకు చెక్కేసారు.  దీంతో రాత్రికి రాత్రే దుకాణాలు  మూసివేయడం, రికార్డులను మాయం చేయడం తదితర ఆరోపణలతో ఎస్‌బీఐ  సీబీఐని ఆశ్రయించింది. ప్రస్తుతం  నిందితులు మారిషస్‌కు పారిపోయివుంటారని బ్యాంకు భావిస్తోంది.
 
రూ. 824 కోట్ల రూపాయల రుణాల మోసానికి సంబంధించి కనిష్క్‌ జ్యువెలరీ యజమాని, డైరెక్టర్లు  భూపేష్‌ కుమార్‌ జైన్‌, అతని భార్య నీతా జైన్‌పై ఎస్‌బీఐ  సీబీఐకి ఫిర్యాదు చేసింది. మొత్తం 14 బ్యాంకుల కన్సార్టియం ఆధ్వర్యంలో  కనిష్క్‌ గోల్డ్‌ జ్యుయలరీ రుణాలను పొందింది. ఈ మొత్తం విలువ వెయ్యి కోట్లకు పైమాటే నని అంచనా. మరోవైపు  గత ఏడాది నవంబరులో రుణఎగవేతదారుడుగా కనిష్క్‌ గోల్డ్‌ సంస్థను బ్యాంకులు ప్రకటించాయి.  ఇది ఇలా ఉంటే 2017 సెప్టెంబరులో కనిష్క్‌ గోల్డ్ వ్యవస్థాపకుడు భూపేష్‌ కుమార్‌ జైన్‌ను రూ. 20 కోట్ల ఎక్సైజ్ పన్ను మోసం కేసులో అరెస్టు అయ్యాడు. బెయిల్‌ మీద విడుదలైన భూపేష్‌ అప్పటినుంచి భార్యతో సహా  పరారీలో ఉన్నాడు. కాగా  చెన్నైలోనే కాకుండా హైదరాబాద్, కొచ్చిన్, ముంబైలలో కూడా కనిష్క్‌ జువెలరీ  తన షాపులను విస్తరించింది.

మరిన్ని వార్తలు