ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌: భారీగా పెరగనున్న జీతాలు, పెన్షన్లు!

5 Nov, 2023 18:58 IST|Sakshi

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ (SBI ) తమ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. జీతాలు, పెన్షన్ల పెంపునకు సంబంధించి ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ ఖారా కీలక విషయం వెల్లడించారు. ఇందుకోసం నిధులను సైతం కేటాయించినట్లు చెప్పారు.

ఉద్యోగుల జీతాలు, పెన్షన్ పెంపుదల కోసం కేటాయింపులు పెరగడం బ్యాంక్‌ రెండవ త్రైమాసిక నికర లాభంపై ప్రభావం చూపిందని ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ ఖారా తెలిపారు.  ఉద్యోగుల జీతాలు 14 శాతం మేర పెంచాలని భావించిన ఎస్‌బీఐ అందుకు అనుగుణంగా నిధులను సైతం పక్కనపెట్టి ఉంచింది. 

2022 నవంబర్ నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉన్న వేతన సవరణ కోసం ఇప్పటివరకు రూ. 8,900 కోట్లను కేటాయించినట్లు ముంబైలో ఎస్‌బీఐ రెండో త్రైమాసిక ఫలితాల ప్రకటన తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో దినేష్‌ ఖారా వెల్లడించారు.

"ఈ కేటాయింపుల వల్ల రెండో త్రైమాసికంలో ఎస్‌బీఐ లాభాలు కొంచెం తగ్గాయి. ఆర్థిక సంవత్సరంలో వృద్ధి ఊపందుకుని 16 శాతం నుంచి 17 శాతం వరకు కొనసాగుతుందని భావిస్తున్నాం. దేశీయ డిమాండ్ బలంగా ఉంది. పండుగ వ్యయాల నేపథ్యంలో ఇది మరింత పెరుగుతుంది" అని ఖారా పేర్కొన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి ఎస్‌బీఐ నికర లాభం 8 శాతం పెరిగి రూ.14,330 కోట్లకు చేరుకుంది. 16 శాతంతో రిటైల్ రుణాల వృద్ధి.. 7 శాతంగా ఉన్న కార్పొరేట్ రుణ వృద్ధిని అధిగమించింది. అయితే కంపెనీలు నెమ్మదిగా రుణాలను పొందుతున్నాయని, రూ. 4.77 లక్షల కోట్ల రుణాలు వివిధ దశల్లో ఉన్నాయని దినేష్‌ ఖారా వివరించారు.

"బ్యాంకుకు రూ. 3.20 లక్షల కోట్ల అన్‌సెక్యూర్డ్ రుణాలు ఉన్నాయి. వీటిలో 86 శాతం సురక్షితమైన ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేస్తున్న కస్టమర్లకే ఇచ్చాం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని ఆయన చెప్పారు. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవలి ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో బ్యాంకులు ఎన్‌బీఎఫ్‌సీల అసురక్షిత రుణ వృద్ధి పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు