‘కింగ్‌ఫిషర్’ బ్రాండ్ల వేలం మళ్లీ ఫ్లాప్

1 May, 2016 01:35 IST|Sakshi
‘కింగ్‌ఫిషర్’ బ్రాండ్ల వేలం మళ్లీ ఫ్లాప్

♦ రిజర్వు ధర రూ.366 కోట్లు
♦ అయినా ముందుకు రాని బిడ్డర్లు
 
 ముంబై: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్... బ్రాండు, ట్రేడ్‌మార్క్‌ల వేలం మరోసారి ఫ్లాపయ్యింది. దాదాపు రూ.9,000 కోట్ల రుణ బకాయిలను రాబట్టుకోవడానికి బ్యాంకులు శనివారం నిర్వహించిన వేలానికి స్పందన కరువైంది. 2010లో బ్రాండ్ విలువను దాదాపు రూ.4,000 కోట్ల మేర లె క్కించి రుణాలిచ్చిన బ్యాంకులు.. ప్రస్తుతం రిజర్వ్ ధరను అందులో పదో వంతు కన్నా తక్కువగా రూ.366.70 కోట్లుగా నిర్ణయించి వేలానికి పెట్టాయి. అయినా కూడా ఒక్క బిడ్   సైతం రాలేదు. ఈ రేటు ఎక్కువ కావటంతో బిడ్డర్లు రాలేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

నెలన్నర కిందట 17 బ్యాంకుల కన్సార్షియం కింగ్ ఫిషర్ హౌస్‌ను రూ.150 కోట్లకు వేలానికి పెట్టినప్పుడూ ఇదే పరిస్థితి. ఒక్క బిడ్ కూడా రాలేదు. తాజా పరిణామంతో బ్యాంకులు.. కింగ్‌ఫిషర్ హౌస్, కింగ్‌ఫిషర్ బ్రాండ్ రిజర్వ్ ధరను పునఃసమీక్షించి, తగ్గించే అవకాశం ఉండొచ్చని బ్యాంకింగ్ వర్గాలు చెప్పాయి. శనివారం కింగ్‌ఫిషర్ లోగోతో పాటు ‘ఫ్లై ది గుడ్‌టైమ్స్’ ట్యాగ్‌లైను, ఫ్లయింగ్ మోడల్స్, ఫన్‌లైనర్, ఫ్లై కింగ్‌ఫిషర్, ఫ్లయింగ్ బర్డ్ డివైజ్ తదితర ట్రేడ్‌మార్క్‌లను వేలానికి ఉంచారు. ఎస్‌బీఐ క్యాప్ ట్రస్టీ కంపెనీ ఆధ్వర్యంలో ఉదయం 11.30 గం.కు ప్రారంభమైన ఈ-ఆక్షన్ .. దాదాపు గంటసేపు సాగింది.

కింగ్‌ఫిషర్ లోగోను ఏవియేషన్ అవసరాలకు మాత్రమే తప్ప ఇతరత్రా వ్యాపారాలకు వినియోగించుకోవడానికి వీల్లేదంటూ యునెటైడ్ బ్రూవరీస్ (కింగ్‌ఫిషర్ ప్రమోటరు విజయ్ మాల్యా కంపెనీ) హెచ్చరించడం కూడా వేలంపై ప్రభావం చూపి ఉండొచ్చని మరో బ్యాంకరు అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బ్రాండును కొనుక్కుని, పునరుద్ధరించడం కన్నా కొత్తగా ఎయిర్‌లైన్ కంపెనీ పెట్టడమే చవకైన వ్యవహారమని బ్రాండింగ్ నిపుణులు చెప్పారు. 2010లో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పరిస్థితి బాగున్నప్పుడు కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్‌టన్.. కంపెనీ బ్రాండ్ విలువను రూ. 4,000 కోట్లుగా లె క్కించింది.

మరిన్ని వార్తలు