కోటక్‌ బ్యాంక్‌ నికర లాభం 27 శాతం అప్‌

1 May, 2018 00:37 IST|Sakshi

క్యూ4లో రూ.1,789 కోట్లు  

మెరుగుపడిన రుణ నాణ్యత

ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హైకి షేర్‌  

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ నికర లాభం(కన్సాలిడేటెడ్‌) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 27 శాతం వృద్ధి చెందింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.1,404 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.1,789 కోట్లకు పెరిగిందని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ తెలిపింది.

మొత్తం ఆదాయం రూ.9,954 కోట్ల నుంచి రూ.10,874 కోట్లకు వృద్ధి చెందిందని ఈ బ్యాంక్‌కు ఎమ్‌డీ, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా సోమవారమే నియమితులైన ఉదయ్‌కోటక్‌ వెల్లడించారు. ఇప్పటివరకూ ఆయన బ్యాంక్‌ వైస్‌ చైర్మన్‌గా, ఎమ్‌డీగా వ్యవహరించారు. నికర వడ్డీ ఆదాయం రూ.2,161 కోట్ల నుంచి 19 శాతం వృద్ధితో రూ.2,580 కోట్లకు పెరిగిందని  వివరించారు. నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎమ్‌) 4.63 శాతం నుంచి 4.35 శాతానికి తగ్గిందని తెలిపారు.   

మొత్తం ఆదాయం రూ.38,724 కోట్లకు..
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.4,940 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 26 శాతం వృద్ధితో రూ.6,201 కోట్లకు పెరిగిందని ఉదయ్‌ కోటక్‌ బ్యాంక్‌ వెల్లడించారు.

మొత్తం ఆదాయం రూ.33,905 కోట్ల నుంచి రూ.38,724 కోట్లకు ఎగిసిందని,  నికర వడ్డీ ఆదాయం రూ.8,126 కోట్ల నుంచి 17 శాతం వృద్ధితో రూ.2,580 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి మొత్తం రుణాలు 25 శాతం వృద్ధితో రూ.1,69,718 కోట్లకు పెరిగాయని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ధి 20 శాతానికి మించి ఉండగలదన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.  

మెరుగుపడిన రుణ నాణ్యత..
బ్యాంక్‌ రుణనాణ్యత మెరుగుపడిందని కోటక్‌ తెలిపారు. 2017 మార్చి నాటికి 2.25 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి 1.95 శాతానికి తగ్గాయని, అలాగే నికర మొండి బకాయిలు  1.09 శాతం నుంచి 0.86 శాతానికి తగ్గాయని  వివరించారు.

మొండి బకాయిలకు కేటాయింపులు మాత్రం రూ.300 కోట్ల నుంచి రూ.313 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. యాక్సిస్‌ బ్యాంక్‌ను కోటక్‌ బ్యాంక్‌ విలీనం చేసుకోవాలంటూ నొముర వెలువరించిన నివేదికను ప్రస్తావిస్తూ, ఊహాగానాలపై ఆధారపడి పనిచేయబోమని, పరిస్థితులు కలసివస్తే, బ్యాంకింగ్‌ రంగంలోనే కాకుండా, ఆర్థిక రంగంలోని కంపెనీలను సైతం విలీనం చేసుకుంటామని వ్యాఖ్యానించారు.  

ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతోబీఎస్‌ఈలో ఈ షేర్‌ జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,218ను తాకింది. చివరకు 2 శాతం లాభంతో రూ.1,210 వద్ద ముగిసింది.  

మరిన్ని వార్తలు