382 మిలియన్ డాలర్లు అధికంగా కట్టాం...

3 Nov, 2016 01:32 IST|Sakshi
382 మిలియన్ డాలర్లు అధికంగా కట్టాం...

గ్రిఫిన్ గని నిల్వలపై బిడ్డర్లను తప్పుదారి పట్టించారు
ఆస్ట్రేలియా సంస్థ కొర్డామెంతాపై ల్యాంకో ఇన్‌ఫ్రా దావా

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : గ్రిఫిన్ కోల్ గనుల నిల్వల విషయంలో తమను తప్పుదోవ పట్టించి 382 మిలియన్ డాలర్లు (500 మిలియన్ ఆస్ట్రేలియా డాలర్లు) అధికంగా కట్టించిందంటూ ఆస్ట్రేలియాకు చెందిన అడ్వైజరీ, ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ కొర్డామెంతాపై ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్ దావా వేసింది. వాస్తవానికి 2015లోనే ఈ దావా వేయగా.. కోర్టు విచారణకు ముందుగా ఈ నెలలోనే సంధి చర్చలు మొదలుపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వివరించారుు. ఆస్ట్రేలియాలోని తమ అనుబంధ సంస్థ ల్యాంకో రిసోర్సెస్ ఆస్ట్రేలియా ద్వారా 2011లో గ్రిఫిన్ కోల్ మైనింగ్ కంపెనీని, కార్పెంటర్ మైన్ మేనేజ్‌మెంట్‌ను ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్ 740 మిలియన్ ఆస్ట్రే లియన్ డాలర్లకు (ఏయూడీ) కొనుగోలు చేసింది.

కార్పెంటర్ మైన్ నిర్వహణ సంస్థ కొర్డామెంతా పర్యవేక్షణలో ఈ డీల్ కుదిరింది. ల్యాంకో ఇప్పటిదాకా 600 మిలియన్ ఏయూడీ చెల్లించింది. మిగతా 150 మిలియన్ ఏయూడీ విషయంలో కొర్డామెంతా, ల్యాంకోకు మధ్య వివాదం నడుస్తోంది. గ్రిఫిన్ గనిలో నిల్వలు ముందుగా చెప్పినదానికన్నా తక్కువే ఉండొచ్చన్న రెండు నివేదికలను తొక్కిపెట్టి, బిడ్డర్లను కొర్డామెంతా తప్పుదారి పట్టించిందని ల్యాంకో ఆరోపిస్తోంది. ల్యాంకో వార్షిక నివేదిక ప్రకారం 2015-16లో గ్రిఫిన్ కోల్ మైన్ నుంచి 2.45 మిలియన్ టన్నుల ఉత్పత్తి, 2.44 మిలియన్ టన్నుల మేర విక్రయాలు జరిగారుు.

గతేడాది గని ద్వారా వచ్చిన రూ. 500 కోట్ల ఆదాయంపై రూ. 133 కోట్ల నష్టం నమోదైంది. కాగా, మార్చిలో ఈ కేసు హియరింగ్‌కు రానున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నారుు. కొర్డామెంతా ఇప్పటికే ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై వ్యాఖ్యానించలేమని ల్యాంకో ఇన్‌ఫ్రా వర్గాలు తెలిపారుు.

మరిన్ని వార్తలు