-

టెక్ ఇంద్రజాలం.. టచ్‌లెస్ స్క్రీన్!

28 Jun, 2015 17:23 IST|Sakshi
టెక్ ఇంద్రజాలం.. టచ్‌లెస్ స్క్రీన్!

స్మార్ట్‌ఫోన్ తనంతట తానే కాల్ చేస్తుంది. రేడియో దానంతట అదే ట్యూన్ అవుతుంది. సౌండ్ మనం కోరుకున్నట్లుగా అడ్జస్ట్ అయిపోతుంది. స్మార్ట్‌వాచ్ నుంచి కంప్యూటర్ వరకూ ఎన్నో పరికరాలను ముట్టుకోవాల్సిన అవసరమే ఉండదు. ఇవన్నీ వాటంతట అవే మనకు కావల్సినట్లే పనిచేస్తాయి! జస్ట్.. మనం చేయవల్సిందల్లా చేతివేళ్లతో గాలిలో సైగలు చేయడమే!!  ఒకప్పుడు ఫోన్లు, కంప్యూటర్లు వాడాలంటే టకటకమంటూ బటన్లు నొక్కాల్సిందే. తర్వాత ఇలా ముట్టుకుంటే అలా స్పందించే టచ్‌స్క్రీన్లు వచ్చేశాయి.

అయితే, ఇకపై టచ్‌స్క్రీన్లపై చేతి వేలితో నొక్కడం, స్వైప్ చేయాల్సిన అవసరం కూడా ఉండబోదు! ఎందుకంటే.. చేతివేళ్లతో సైగలు చేస్తేచాలు.. టచ్ చేసినట్లు స్పందించే టచ్‌లెస్ స్క్రీన్లు త్వరలోనే రాబోతున్నాయి! ఈ టచ్‌లెస్ టెక్నాలజీని సాకారం చేసేందుకు గాను గూగుల్ కంపెనీ ‘ప్రాజెక్ట్ సోలి’ పేరుతో చేపట్టిన ప్రాజెక్టు ఇప్పుడు తుది దశకు చేరుకుంది. ప్రాజెక్ట్ సోలి బృందం ఈ టెక్నాలజీ ప్రాథమిక ఉపయోగాలను కాలిఫోర్నియాలో ఇటీవల జరిగిన సదస్సులో ప్రదర్శించింది. రేడియో స్టేషన్లను మార్చడం, సౌండ్ వాల్యూమ్‌ను పెంచడం, తగ్గించడం, స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ను పనిచేయించడం వంటివి చేసి చూపింది.  
 
ముట్టుకోకుండా ఎలా పనిచేస్తుంది?
కెమెరాలు, సెన్సర్ల సాయంతో కదలికలను గుర్తించి పనిచేసే పరికరాలు ఇదివరకే ఉన్నాయి. కానీ వీటిని ఉపయోగించాలంటే ఇతర హార్డ్‌వేర్ పరికరాలు కూడా అవసరం. అందుకే రాడార్‌తో కదలికలను గుర్తించి పనిచేసే మైక్రోచిప్‌ను ప్రాజెక్టు సోలి బృందం తయారు చేసింది. ఈ మైక్రోచిప్‌తో అతిచిన్న పరికరాలకు సైతం టచ్‌లెస్‌గా పనిచేసే స్క్రీన్‌ను అమర్చుకోవచ్చు. షూ బాక్స్ అంత సైజులో ఉండే చిన్న రాడార్‌ను ఒక మైక్రోచిప్‌లో అమర్చేంత స్థాయికి వీరు కుదించి తయారు చేశారు.

దీంతో బయటికి కనిపించకుండా లోపల ఉంటూనే ఈ రాడర్ ఒక మీటరు పరిధిలో స్పెక్ట్రమ్‌ను ఏర్పర్చి చేతివేళ్ల కదలికలను కచ్చితత్వంతో గుర్తిస్తుంది. స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, కంప్యూటర్లు, వేరబుల్ గ్యాడ్జెట్స్, కారు భాగాలు, ఆటబొమ్మల వంటి ఎన్నో పరికరాలకు ఈ టెక్నాలజీని ఉపయోగించవ చ్చని చెబుతున్నారు. ఈ ఓపెన్ సోర్స్ టెక్నాలజీని వివిధ పరికరాలకు ఉపయోగించేందుకు వీలుగా మార్చేందుకు గాను ఈ ఏడాదిలోనే డెవలపర్లకు అప్పగించనున్నారు.

మరిన్ని వార్తలు