హైదరాబాద్‌లో ‘ఎఫ్‌–16’ రెక్కల తయారీ

5 Sep, 2018 00:31 IST|Sakshi

 2020 నుంచి తయారీ ప్రారంభం

నిర్ణయించిన లాఖీడ్‌ మార్టిన్‌

టాటా కంపెనీతో భాగస్వామ్యం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: భాగ్యనగరం మరో రికార్డును నమోదు చేయబోతోంది. అమెరికాకు చెందిన రక్షణ , ఏరోస్పేస్, టెక్నాలజీ దిగ్గజం లాఖీడ్‌ మార్టిన్‌... ఎఫ్‌–16 ఫైటర్‌ జెట్‌ల రెక్కల తయారీని హైదరాబాద్‌లో చేపట్టబోతోంది. ఇక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తారు. 2020 చివరి నుంచి వీటి ఉత్పత్తి ప్రారంభమవుతుంది.

ఇందుకోసం టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌తో (టీఏఎస్‌ఎల్‌) భాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్టు లాఖీడ్‌ వెల్లడించింది. టీఏఎస్‌ఎల్‌కు హైదరాబాద్‌ సమీపంలోని మహేశ్వరం దగ్గరి ఏరోస్పేస్‌ హార్డ్‌వేర్‌ పార్క్‌లో తయారీ కేంద్రం ఉంది. ప్రస్తుతం ఎఫ్‌–16 విమాన రెక్కలు ఇజ్రాయెల్‌లో రూపొందుతున్నాయి. ఎఫ్‌–16 వింగ్స్‌ను ఇకపై పూర్తిగా భారత్‌లోనే తయారు చేయాలని లాఖీడ్‌ నిర్ణయించడం విశేషం.

జేవీ ఆధ్వర్యంలో..: లాఖీడ్‌ మార్టిన్, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ ఇప్పటికే సంయుక్త భాగస్వామ్య కంపెనీని ఏర్పాటు చేశాయి. టాటా లాఖీడ్‌ మార్టిన్‌ ఏరోస్ట్రక్చర్స్‌ పేరుతో ఏర్పాటైన ఈ కంపెనీ టర్బోప్రాప్‌ మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సి–130 విడిభాగాలను రూపొందిస్తోంది. ఎస్‌–92 హెలికాప్టర్ల క్యాబిన్లు సైతం హైదరాబాద్‌ ప్లాంటులో తయారవుతున్నాయి.

ఎఫ్‌–16 ఫైటర్‌ జెట్స్‌ రెక్కల తయారీ గురించి లాఖీడ్‌ మార్టిన్‌ ఏరోనాటిక్స్‌ స్ట్రాటజీ, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వివేక్‌ లాల్‌ స్పందిస్తూ... అడ్వాన్స్‌డ్‌ డిఫెన్స్‌ రంగంలో టాటాల సామర్థ్యంపై తమకున్న నమ్మకానికిది నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌సహా 28 దేశాలు ఎఫ్‌–16 రకం 4,604 విమానాలను కొనుగోలు చేశాయి.  

మరిన్ని వార్తలు