మారన్‌ బ్రదర్స్‌కు భారీ ఎదురుదెబ్బ

25 Jul, 2018 15:43 IST|Sakshi
కళానిధి మారన్‌, దయానిధి మారన్‌ (ఫైల్‌ ఫోటో)

చెన్నై :  కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్‌, ఆయన సోదరుడు కళానిధి మారన్‌లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అక్రమ టెలిఫోన్‌ ఎక్స్చేంజ్‌ కేసులో దయానిధి మారన్‌, కళానిధి మారన్‌లను నిర్దోషులుగా ప్రకటిస్తూ కింద కోర్టు ఇచ్చిన తీర్పులను మద్రాస్‌ హైకోర్టు కొట్టివేసింది. సీబీఐ దాఖలు చేసిన ఫిర్యాదును అనుమతించింది. ఈ ఇద్దరు బ్రదర్స్‌కు, ఇతరులకు వ్యతిరేకంగా 12 వారాల్లో అభియోగాలను నమోదు చేయాలని మద్రాస్‌ హైకోర్టు కోర్టు, సీబీఐను ఆదేశించింది. దయానిధి మారన్‌ కమ్యూనికేషన్‌, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీలకు మంత్రిగా ఉన్న సమయంలో ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేసి, సన్‌ నెట్‌వర్క్‌ కోసం అక్రమంగా ప్రైవేట్‌ టెలిఫోన్‌ ఎక్స్చేంజ్‌ను తన నివాసంలోనే ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్చేంజ్‌ ద్వారా 764 హై-స్పీడ్‌ లైన్లను సన్‌ నెట్‌వర్క్‌ వాడుకునే అవకాశాన్ని కల్పించారు.

ఈ టెలిఫోన్‌ లైన్లకు ఎలాంటి బిల్లులను చెల్లించలేదు. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.1.78 కోట్ల నష్టం వచ్చింది. మారన్‌ బ్రదర్స్‌ కలిగి ఉన్న సన్‌ నెట్‌వర్క్‌, దేశంలో అతిపెద్ద మీడియా కంపెనీల్లో ఇది ఒకటి. టెలివిజన్‌, న్యూస్‌పేపర్‌, రేడియోలను ఇది కలిగి ఉంది. టెలిఫోన్‌ ఎక్సేంజ్‌ కేసులో టెలికాం శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్‌, ఆయన సోదరుడు కళానిధి మారన్‌తో పాటు మరో ఐదుగురిని చెన్నైలోని ప్రత్యేక సీబీఐ కోర్టు గత మార్చిలోనే నిర్దోషులుగా ప్రకటించింది. వీరికి వ్యతిరేకంగా ఎలాంటి రుజువులు లేవని కేసును కొట్టివేసింది. అయితే ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై, సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. కింద కోర్టు ఇచ్చిన ఈ తీర్పును జీ జయచంద్రన్‌ కొట్టివేశారు. 12 వారాల్లోగా వారిపై అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో మారన్‌ బ్రదర్స్‌ను అక్రమ టెలిఫోన్‌ ఎక్స్చేంజ్‌ కేసు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. 

మరిన్ని వార్తలు